
5 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్
రోలుగుంట: హత్యాయత్నం కేసులో అయిదేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని అరెస్ట్ చేసినట్టు ఎస్సై రామకృష్ణారావు మంగళవారం తెలిపారు. మండలంలోని బీబీపట్నం గ్రామానికి చెందిన బాకూరి రామరాజుపై హత్యాయత్నం కేసు నమోదు కాగా, అప్పటి నుంచి కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడన్నారు. ఈ నేపథ్యంలో గ్రామానికి వచ్చినట్టు సమాచారం అందుకుని మంగళవారం ఇతన్ని అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరిచామని తెలిపారు.
ఇద్దరు యువకులపై పోక్సో కేసు
అనకాపల్లి టౌన్: బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్సై రవికుమార్ మంగళవారం తెలిపారు. ఓ గ్రామానికి చెందిన బాలిక(14)పై తగరంపూడి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు లైంగికదాడికి పాల్పడినట్టు ఫిర్యాదు అందిందన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
11 మంది కార్మిక నాయకులకు షోకాజ్ నోటీసులు
సాక్షి, విశాఖపట్నం : స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం 11 మంది కార్మిక నాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 20న దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు మంగళవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో బ్లాస్ట్‌ఫర్నేస్–1 విభాగంలో సమ్మె ప్రచారం నిర్వహించారు. దీనిపై ఆగ్రహించిన యాజమాన్యం కంపెనీ నిబంధనలకు వ్యతిరేకంగా పనిప్రదేశం వదిలి వెళ్లడాన్ని తప్పు పడుతూ 11 మంది కార్మిక నాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మరికొందరికి బుధవారం నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం. కార్మిక నాయకులకు షోకాజ్ నోటీసు జారీ చేయడం పట్ల కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. యాజమాన్యం వైఖరికి నిరసనగా బుధవారం ఉదయం ఉక్కు అడ్మిన్ భవనం కూడలి వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు కార్మిక నాయకులు ప్రకటించారు.