
పచ్చిరొట్ట సాగుకు అనుకూలం
అనకాపల్లి: వర్ష సూచన ఉన్నందున కోత దశలో నువ్వు పైరును వాతావరణ పరిస్థితులు గమనించి కోసుకోవాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ సీహెచ్.ముకుందరావు తెలిపారు. స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్ కార్యాలయంలో శాస్త్రవేత్తలతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోసిన పంటలు వర్షానికి తడవకుండా రైతులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రాగల వర్షాన్ని ఉపయోగించుకుని ఖరీఫ్‌కి ముందు జనుము లేదా జీలుగ లేదా పిల్లిపెసర లేదా పెసర వంటి పచ్చిరొట్ట పైరును వేసుకోవడానికి ఇదే అనువైన సమయమని పేర్కొన్నారు. వర్షాన్ని వినియోగించుకుని చెరకు వేసే రైతులు నేల తయారీ చేసుకోవాలన్నారు. చెరకులో నల్లి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పక్వానికి వచ్చి మామిడి, బొప్పాయి పండ్లను కోసి మార్కెట్‌కు తరలించాలన్నారు. పక్వానికి రాని గెలలు ఉంటే, కింద పడకుండా ఉండడానికి కర్రలతో ఊతమివ్వాలన్నారు. మామిడిలో పండు ఈగ ఆశించే అవకాశం ఉందని, నివారణకు రాలిపోయిన పండ్లను ఏరి నాశనం చేయాలన్నారు. ప్లాస్టిక్ పళ్లెంలో మిథైల్ యూజినాల్ 2 మి.లీ. ఒక లీటరు నీటిలో కలిపి తోటలో వేలగట్టాలని లేదా మార్కెట్‌లో లభ్యమయ్యే పండు ఈగను ఆకర్షించే బుట్టలను ఎకరాకు 5 చొప్పున 5–6 అడుగుల ఎత్తులో కొమ్మలకు కట్టాలని సూచించారు. వేసవిలో లోతు దుక్కులు దున్నుకోవడానికి ఇది సరైన సమయమన్నారు. లోతు దుక్కులు చేయడం వల్ల కలుపు సమస్యను అధిగమించవచ్చని, పంటను నష్టపరిచే కీటకాలు, తెగుళ్ల ఉధృతిని తగ్గించవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు బి.భవాని, పి.వి.పద్మావతి. ఎ.అలివేణి తదితరులు పాల్గొన్నారు.