మట్టి..కొల్లగొట్టి | - | Sakshi
Sakshi News home page

మట్టి..కొల్లగొట్టి

May 14 2025 1:27 AM | Updated on May 14 2025 1:27 AM

మట్టి

మట్టి..కొల్లగొట్టి

రెచ్చిపోతున్న గ్రావెల్‌ మాఫియా పోలవరం ఎడమ కాల్వ, అసైన్డ్‌ భూముల్లో అక్రమ తవ్వకాలు
● యథేచ్ఛగా అక్రమ రవాణా ● చోద్యం చూస్తున్న రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు ● అడ్డుకట్ట వేయాలని ప్రజల డిమాండ్‌

యలమంచిలి రూరల్‌: మండలంలో మట్టి మాఫియా పేట్రేగిపోతోంది.అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా నిర్వహిస్తూ రూ.కోట్లు గడిస్తోంది.అధికార టీడీపీ,జనసేన నేతల అండదండలు మట్టి మాఫియాకు ఉండడంతో అధికారులు సైతం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా పోలవరం ఎడమ ప్రధాన కాల్వ గట్టు,చెరువులు,అసైన్డ్‌ భూములు,పంట పొలాల్లో మట్టిని యంత్రాలతో యథేచ్ఛగా తవ్వు తూ టిప్పర్లు,ట్రాక్టర్లతో ప్రైవేటు వెంచర్లు,కట్టడాలు, ఇటుక బట్టీలకు తరలించి రూ.లక్షలు గడిస్తున్నారు. ఈ అక్రమ మట్టి తవ్వకాలను రెవెన్యూ,గనుల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా ఇంతవరకు కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.మండలంలో నిత్యం కొంతమంది టీడీపీ,జనసేన గ్రామ,మండల స్థాయి నాయకుల కనుసన్నల్లో ప్రతి రోజూ పదుల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లతో మట్టి అక్రమ రవాణా జరుగుతోంది. మంగళవారం యలమంచిలి మండలం ఏటికొప్పాకలో సచివాలయం ఎదురుగా ఉన్న రహదారి మీదుగా వీఆర్వో చూస్తుండగానే పది ట్రాక్టర్లతో మట్టిని ఓ ఇంటి నిర్మాణ పనులకు తరలించడం,ఆ వివరాలను సేకరించేందుకు వెళ్లిన కొందరు మీడియా ప్రతినిధులపై మట్టి మాఫియా దురుసుగా ప్రవర్తించడం, మీ ఇష్టం వచ్చిన పనిచేసుకోండని ప్రవర్తించిన తీరు మండలంలో చర్చనీయాంశమైంది.

కల్పతరువు.. పోలవరం కాల్వ గట్లు

యలమంచిలి మండలంలో పోలవరం ఎడమ ప్రధాన కాల్వ గట్ల నుంచి గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు ఎక్కువగా జరుగుతున్నాయి.కొందరు అక్రమార్కులు అధికార కూటమి నేతల అండదండలతో రాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా యంత్రాలతో తవ్వకాలు జరిపి,లారీలు,ట్రాక్టర్లతో అక్రమంగా తరలించి విక్రయిస్తున్నారు.లారీ సైజును బట్టీ గ్రావెల్‌ లేదా మట్టి లోడుకు రూ.6 వేల నుంచి రూ.22,500 వేలు,ట్రాక్టరుకు రూ.1500 నుంచి రూ.2000 వరకు వసూలు చేస్తున్నారు. నిరంతరాయంగా ఈ దందా కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ముఖ్యంగా ఈ అక్రమ తవ్వకాలపై నిఘా ఉంచి, అడ్డుకోవాల్సిన రెవెన్యూ,గనుల శాఖ అధికారులు, కిందిస్థాయి సిబ్బంది పట్టించుకోవడంలేదన్న విమర్శలున్నాయి. ఎవరైనా మీడియా ప్రతినిధులు తెలియజేసినప్పుడు లేదా పత్రికల్లో వార్తలు వచ్చిన సందర్భాల్లో ఒకటి రెండ్రోజులు హడావుడి చేయడం తప్ప పకడ్బందీగా మట్టి మాఫియా ఆగడాలు కట్టించడంలో అధికారులు విఫలమవుతున్నారనే చెప్పాలి.మట్టి అక్రమ తవ్వకాలు ఎక్కువగా శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారే వరకు,ఇతర సెలవు దినాల్లో జరుగుతున్నాయి.ఇక కొన్ని చోట్ల పట్టపగలే దర్జాగా అధికారపార్టీ ప్రజా ప్రతినిధుల అండదండలతో ఈ దందా కొనసాగుతోంది.

వెంచర్లు,బట్టీలు,నిర్మాణాలకు తరలింపు

యలమంచిలి పరిసర ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు,ఇటుక బట్టీలు, నిర్మాణాలకు మట్టిని భారీగా తరలిస్తున్నారు.వెంచర్లు వేసేటప్పుడు మట్టి ఎక్కువగా అవసరమతుంది.వీటికి అవసరమయ్యే మట్టి లేదా గ్రావెల్‌ను జనసేన,టీడీపీ నేతలు గంపగుత్తగా మాట్లాడుకుని మట్టి తోలుకుని రూ.లక్షల్లో వెనకేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ గ్రావెల్‌,మట్టి తవ్వకాల సమాచారం అందించినా గనుల శాఖ అధికారులు సిబ్బంది కొరత పేరుతో తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు.ఎక్కడైనా మట్టి అక్రమంగా తవ్వకాలు జరుపితే ఎంత మొత్తంలో మట్టి తరలించారో నిర్థారించాల్సిన గనుల శాఖ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.ఇక రెవెన్యూ అధికారులు,సిబ్బంది సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తమ కళ్లముందే అక్రమ వ్యవహారం జరుగుతున్నా కళ్లకు గంతలు కట్టుకోవడం మరీ దారుణం.

చర్యలు తీసుకుంటాం

అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. మట్టి,గ్రావెల్‌ తవ్వకాలపై ని ఘా ఉంచుతున్నాం.గ్రామ స్థాయిలో వీఆర్వో,ఆపైన ఆర్‌ఐలు పర్యవేక్షించేలా ఆదేశాలిస్తున్నాం.ఎక్కడైనా అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు చేస్తే మాకు సమాచారం అందించాలి.తక్షణమే మా సిబ్బందిని ఆ ప్రాంతానికి పంపించి ఆయా వాహనాలను స్వాధీనపర్చుకుని. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

–కె.వరహాలు, తహసీల్దార్‌, యలమంచిలి

మీడియాపై దౌర్జన్యం

మట్టి అక్రమ తవ్వకాలు జరుపుతున్న సంగతి తెలిసి కొందరు మీడియా ప్రతినిధులు వాటిని కవర్‌ చేసేందుకు వెళుతున్నపుడు అక్రమార్కులు వారిపై దురుసుగా ప్రవర్తించడం,కొందరు దుర్భాషలాడుతూ,దౌర్జన్యాలకు దిగడానికి కూడా వెనుకాడడం లేదు. ఫొటోలు,వీడియోలు తీస్తున్న మీడియా ప్రనినిధులను అడ్డుకోవడం,వారిపట్ల దురుసుగా మాట్లాడడం పరిపాటిగా మారింది.ఇటీవల యలమంచిలి సమీపంలో మామిడివాడ,కొత్తూరు ప్రాంతాల్లో ఒక జనసేన నాయకుడు అక్రమంగా చేస్తున్న మట్టి తవ్వకాల వద్దకు వెళ్లిన ఒక మీడియా ప్రతినిధిపై దౌర్జన్యానికి దిగాడు.మంగళవారం యలమంచిలి మండలం ఏటికొప్పాకలో జరుగుతున్న మట్టి అక్రమ రవాణా వద్దకు వెళ్లిన మీడియా ప్రతినిధులతో అక్రమార్కులు మీ ఇష్టం వచ్చిన పని చేసుకోండి..ఏమీ చేయలేరని నిర్లక్ష్యంగా సమాధానమివ్వడం వెనుక అధికార యంత్రాంగం అండదండలు స్పష్టంగా కనిపిస్తున్నాయనే చెప్పాలి.మీడియా ప్రతినిధులు సమాచారం ఇచ్చినా గ్రామస్థాయిలో వీఆర్వో అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ తవ్వకాలు జరుపుతున్న పొక్లెయిన్‌,మట్టి అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను అక్కడి నుంచి తరలించుకుపోయిన తర్వాత అక్కడకు వెళ్తుండడం వెనుక ఆంతర్యం బహిరంగ రహస్యమే.

మట్టి..కొల్లగొట్టి1
1/3

మట్టి..కొల్లగొట్టి

మట్టి..కొల్లగొట్టి2
2/3

మట్టి..కొల్లగొట్టి

మట్టి..కొల్లగొట్టి3
3/3

మట్టి..కొల్లగొట్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement