
రూ.31 కోట్లతో తాగునీటి సమస్యకు పరిష్కారం
● ఉపాధి హామీలో ఇంకుడు గుంతల తవ్వకాలు ● జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో చైర్‌పర్సన్ సుభద్ర వెల్లడి
మహారాణిపేట(విశాఖ): ఉమ్మడి విశాఖజిల్లాలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.31 కోట్లు కేటాయించిందని, ఈ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె.సుభద్ర మంగళవారం తెలిపారు. జల్ జీవన్ మిషన్ పనులు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఆమె వివరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు చిత్తశుద్ధితో పరిష్కరించాలని సూచించారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన పలు స్థాయీ సంఘాల సమావేశాల అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మూడు ఇంకుడు గుంతల తవ్వకానికి అనుమతిస్తున్నట్టు తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న మురుగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఇంకుడు గుంతలను నిర్మించనున్నట్టు చైర్‌పర్సన్ వెల్లడించారు. ఒక్కో ఇంకుడు గుంత నిర్మాణానికి సుమారు రూ. 74 వేల వరకు ఖర్చు అవుతుందని, ఈ నిధులను పూర్తిగా ఉపాధి హామీ పథకం ద్వారానే వెచ్చిస్తామని ఆమె స్పష్టం చేశారు. సమావేశంలో గ్రామీణాభివృద్ధి, ప్రజా సంక్షేమ పనులు, ప్రణాళికలు, ఆర్థిక సాయం, వైద్య ఆరోగ్యం తదితర అంశాలపై విస్తృత చర్చ జరిగింది. వివిధ శాఖల అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను సభకు సమర్పించగా, సభ్యులు పలు ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు. సామాజిక పింఛన్ల పంపిణీపై స్పందిస్తూ, ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, ఒకవేళ ఎవరికై నా పింఛను అందకపోతే వెంటనే ఎంపీడీవోని సంప్రదించాలని చైర్‌పర్సన్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థలం కలిగిన రైతులు తమ భూముల్లో మొక్కలు పెంచడానికి ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించుకోవచ్చని ఆమె తెలిపారు.
మన్యంలో దోమల బెడద
అరకు జెడ్పీటీసీ శెట్టి రోషిణి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో దోమల బెడద అధికంగా ఉందని, దీని నివారణకు తక్షణమే ఫాగింగ్ చేపట్టాలని కోరారు. దోమల వల్ల మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 108 అంబులెన్సులు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, అత్యవసర పరిస్థితుల్లో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె చెప్పారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె.సుభద్ర అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం, బండారు సత్యనారాయణమూర్తి, జిల్లా పరిషత్ సీఈవో పి.నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో కె.రాజ్‌కుమార్, మూడు జిల్లాల వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

రూ.31 కోట్లతో తాగునీటి సమస్యకు పరిష్కారం