
ఖాళీ క్యారేజీలతో ఉపాధి వేతనదారుల ఆందోళన
దేవరాపల్లి: ఉపాధి హామీపథకం బకాయిల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కూలీలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని తిమిరాం, వెంకటరాజుపురం గ్రామాల్లో ఉపాధి హామీ పథకం వేతనదారులు ఖాళీ క్యారేజీలతో ఆందోళన చేశారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. వెంకన్న మద్దతు పలికారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ ఉపాధి వేతనదారులకు కూలి సొమ్ముతో పాటు ఆశాఖలో ఉద్యోగులకు సైతం జీతాలు చెల్లించక పోవడం దారుణమన్నారు. కూటమి పాలనలో ఉపాధి హామీపథకం అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల శ్రామిక కుటుంబాలకు రూ. 800 కోట్లు మేర బకాయిలు ఉండడంతో పేద ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 15 వేల మంది ఉద్యోగులు, సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వేసవిలో వ్యవసాయ పనులు లభించక ఉపాధి హామీ పనులపై ఆధారపడి జీవించే పేదల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఈ పథకంలో రాజకీయ జోక్యం మితిమీరిపోతోందని ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్లను ఏక పక్షంగా తొలగించి కూటమి సానుభూతి పరులను నియమిస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రామాల్లో పార్టీల వారీగా పను లకు కేటాయిస్తున్నారని, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే పనులు కల్పించేలా ఒత్తిళ్లు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఇంతటి దౌర్భాగ్యపు పరిస్థితులు మునుపెన్నడూ లేవని, ఉపాధి బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20న ఉపాధి పనులు బంద్ చేస్తామని, దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని వెంకన్న కోరారు.
పథకం అమలులోమితిమీరిన రాజకీయ జోక్యం
ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకన్న