
ఎస్పీ కార్యాలయానికి 20 అర్జీలు
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యలు ఫిర్యాదుల పరిష్కార వేదికకు 20 అర్జీలు వచ్చాయి. తమ కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, చీటింగ్ వంటి అంశాలపై అర్జీలు వచ్చినట్లు చెప్పారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, ఎస్‌ఐ వెంకన్న పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయానికి అందిన ఫిర్యాదుల్లో కొన్ని...
బంగారం తాకట్టు విడిపించాలని...
తనకు నగదు అవసరమై బాబాయి వరస అయిన నారాయణరావు పేరు మీద అనకాపల్లి అన్నపూర్ణ బ్యాంక్‌లో 5.5 తులాల బంగారాన్ని తాకట్టు పెట్టానని, అయితే తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించాలని కోరగా తన సొంత ఖర్చులకు రూ.2 లక్షలు ఇస్తేనే విడిపిస్తానని అంటున్నారని అనకాపల్లి మండలం మార్టూరుకు చెందిన గిసాల కుమారి తెలిపింది. దీనిపై గ్రామ పెద్దల సమక్షంలో పెట్టినప్పటికీ సమస్య పరిష్కరించలేదని, దీంతో ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపింది.
ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిపై ఫిర్యాదు
తన కుమారుడికి మెడికల్ డిపార్టుమెంట్‌లో ఉద్యోగం వేయిస్తామని చెప్పడంతో విశాఖ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న తన బంధువు ద్వారా అనకాపల్లి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఒక హెడ్ కానిస్టేబుల్‌కు 2003 జూలై 1వ తేదీన రూ.5.10 లక్షలు ఇచ్చానని కాకినాడ జిల్లా పిఠాపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి అల్లం అప్పలనర్సయ్య తెలిపారు. ఆ హెడ్ కానిస్టేబుల్ అమరావతిలో డిప్యూటేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారని, త్వరలో ఉద్యోగం వేయిస్తానని చెప్పి నేటికీ ఉద్యోగం వేయించలేదని, దీంతో ఇచ్చిన నగదును ఇవ్వాలని కోరినా స్పందించడం లేదని తెలిపారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసగించిన హెడ్ కానిస్టేబుల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు.