
గురువులకు సర్దుపోటు!
● ఉపాధ్యాయుల్లో బదిలీల గుబులు ● తుదిదశకు ఖాళీల కసరత్తు ● ఉమ్మడి జిల్లాలో భారీగా సర్‌ప్లస్ టీచర్లు ● మోడల్ స్కూళ్లకు హెచ్‌ఎంలుగా స్కూల్ అసిస్టెంట్లు ● సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు గండం
విశాఖ విద్య: ఉపాధ్యాయుల బదిలీలకు నేడో, రేపో ఉత్తర్వులు వెలువడనున్న నేపథ్యంలో స్కూళ్లలో ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయనే లెక్క తీసే పనిలో జిల్లా విద్యాశాఖ యంత్రాంగం తలమునకలై ఉంది. మంగళవారం నాటికి వాస్తవ ఖాళీలను ధ్రువీకరించాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లాలోని ఎంఈవోలు, డీఈవో కార్యాలయ సిబ్బంది అంతా ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఎంఈవోలను తన కార్యాలయానికి పిలిపించి.. వారి సమక్షంలోనే వాస్తవ ఖాళీలను లెక్క తీసి, వాటిని ధ్రువీకరించేలా డీఈవో ప్రేమ్‌కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో సోమవారం రాత్రి కూడా డీఈవో కార్యాలయంలోనే అధికారులు, సిబ్బంది అంతా క్షణం తీరిక లేకుండా విధులు నిర్వహించారు.
జిల్లాలో ఏడు రకాల బడులు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 117 జీవోను రద్దు చేసి, దానికి ప్రత్యామ్నాయంగా జిల్లాలో ఏడు రకాల బడుల ఏర్పాటుకు ప్రస్తుత ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో 3,158 పాఠశాలలు ఉండగా ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా ఏడు రకాలుగా బడులు (ఫౌండేషన్, బేసిక్ ప్రాథమిక, మోడల్ ప్రాథమిక, యూపీ పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, హైస్కూల్ ప్లస్ మోడల్ ప్రాథమిక పాఠశాలలు) కూర్పు చేసి ఇక్కడి అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. 2024 డిసెంబర్ నాటికి స్కూళ్లలో నమోదైన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులను లెక్క కట్టి, ఇందుకనుగుణంగానే ఖాళీల జాబితాలను సిద్ధం చేశారు.
ఎస్జీటీ పోస్టులకు గండం
ఉమ్మడి విశాఖ జిల్లాలో సుమారుగా 596 మోడల్ ప్రాథమిక స్కూళ్లును ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులను కేటాయిస్తున్నారు. కాగా వీటిలో ప్రధానోపాధ్యాయుడిగా స్కూల్ అసిస్టెంట్‌ను నియమించనున్నారు. దీంతో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు గండిపడే అవకాశం ఉందని ఉపాధ్యాయులు అంటున్నారు.
హైస్కూళ్లలో భారీగా సర్‌ప్లస్ టీచర్లు
కొత్తగా ఏర్పాటు కాబోయే స్కూళ్లకు అనుగుణంగా పోస్టులు రేషనలైజేషన్ చేపట్టగా, హైస్కూళ్లలో భారీగా మిగులు ఉపాధ్యాయులు లెక్క తేలారు. గణితం, ఫిజికల్ సైన్సు, ఇంగ్లిష్ పోస్టుల్లో పనిచేసే వారే ఎక్కువగా మిగులుగా తేలారు. తాజా లెక్కల ప్రకారం సుమారుగా 234 మంది స్కూల్ అసిస్టెంట్లు సర్‌ప్లస్ కాబోతున్నారు. వీరందరినీ మోడల్ ప్రాథమిక స్కూళ్లులో సర్దుబాటు చేసేలా కసరత్తు చేస్తున్నారు.
గుబులు మొదలు
రేషనలైజేషన్ ప్రక్రియతో ఉపాధ్యాయుల్లో గుబులు మొదలైంది. బదిలీలకు అంతా సిద్ధం చేస్తున్నప్పటికీ ఉమ్మడి జిల్లాలో భారీగా సర్‌ప్లస్‌లో ఉపాధ్యాయులు ఉండటంతో.. బదిలీల్లో ఎక్కడికి స్థానభ్రంశం కలుగుతుందోనన్న ఆందోళన ఉపాధ్యాయుల్లో మొదలైంది. డీఈవో కార్యాలయ అధికారులు ప్రకటించిన ఖాళీల జాబితాలతో తాము ఎక్కడికి బదిలీపై వెళ్లాలనే దానిపై ఉపాధ్యాయులు లెక్కలేసుకుంటున్నారు. రేషనలైజేషన్ మేరకు ఏ పోస్టులు పోతున్నాయి? ఏ పోస్టులు మిగులుతున్నాయనే విషయాన్ని డీఈవో కార్యాలయ అధికారులు ఎప్పుడు ప్రకటిస్తారా అని ఉపాధ్యాయులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.