
అన్న ట్యాబ్‌లో గేమ్‌లు ఆడవద్దన్నాడని..
● బాలిక బలవన్మరణం ● కేజిహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి
కె.కోటపాడు: ట్యాబ్‌లో గేమ్‌లు ఆడుతోందని అన్న మందలించడంతో క్షణికావేశంలో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పాచిలవానిపాలెం గ్రామానికి చెందిన పాచిల యమున (16) గత నెల 27న ట్యాబ్‌లో గేమ్‌లు ఆడడం చూసి అన్న జయంత్ మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన బాలిక.. తల్లిదండ్రులు పాచిల వరలక్ష్మి, శ్రీరామ్మూర్తి, అన్న జయంత్ పొలం పనులపై మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లాక ఉరి వేసుకుంది. ఇంటికి తిరిగి వచ్చిన తల్లి యమున ఫ్యాన్‌కు వేలాడడం గమనించి భర్తకు తెలపగా కుమార్తెను హుటాహుటిన చౌడువాడ పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం అనకాపల్లిలో గల ఉషా ప్రైమ్ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 2 వరకూ అక్కడే వైద్యం అందించారు. ఆమె ఆరోగ్య పరిస్ధితిలో మార్పు రాకపోవడంతో ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు యమునను అదే రోజు విశాఖ కేజీహెచ్‌లో చేర్చారు. ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న యమున ఆరోగ్య పరిస్ధితి మరింత విషమించి ఈనెల 11వ తేదీ ఆదివారం రాత్రి ఆస్పత్రిలో మృతి చెందింది. యమున మృతిపై కె.కోటపాడు పోలీసులకు మేనమామ దొగ్గ కృష్ణ సోమవారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన కె.కోటపాడు ఎస్‌ఐ ఆర్.ధనుంజయ్ విచారణ జరుపుతున్నారు. కేజీహెచ్‌లో పోస్టుమార్టం పూర్తయ్యాక శవాన్ని బంధువులకు అప్పగించారు.
ఈ ఏడాది పదిలో 531 మార్కులు
ఈ ఏడాది పది పబ్లిక్ పరీక్షల్లో మృతురాలు పాచిల యమున 531 మార్కులు సాధించింది. యమున ప్రతి పరీక్షలో మంచి మార్కులు సాధించేందని బంధుమిత్రులు తెలిపారు. యమున 8వ తరగతి నుంచి ప్రస్తుతం 10 వరకు తానాం రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకుంది. ఇంటర్మీడియట్‌లో చేరాల్సి ఉన్న ఆ బాలిక అన్నతో జరిగిన ఘర్షణ కారణంగా క్షణికావేశంలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది.