
సింహగిరికి వైశాఖ పౌర్ణమి శోభ
సింహాచలం: వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం సింహగిరికి భక్తులు పోటెత్తారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఇలవేల్పుగా పూజించే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల భక్తులు, మత్స్యకారులు కుటుంబసమేతంగా పెద్ద సంఖ్యలో సింహాచలం తరలివచ్చారు. తొలుత కొండదిగువ వరాహ పుష్కరిణిలో స్నానాలు ఆచరించారు. వంటలు వండుకుని కుటుంబ సమేతంగా సహపంక్తి భోజనాలు చేశారు. కోలలతో నృత్యాలు చేస్తూ స్వామిని కీర్తించారు. గరిడీ నృత్యాలు చేశారు. మెట్లమార్గం ద్వారా నడిచి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. స్నానమాచరించేందుకు తరలివచ్చిన భక్తులతో వరాహ పుష్కరిణి ప్రాంగణం కిక్కిరిసింది. పుష్కరిణి నుంచి అడవివరం మార్కెట్ కూడలి వరకు ఉన్న మార్గం భక్తజన సంద్రంగా మారింది. సింహగిరిపై దర్శన క్యూలు, కేశఖండనశాల, ప్రసాద విక్రయశాల, భక్తులతో నిండిపోయాయి. వరాహ పుష్కరిణి వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గోపాలపట్నం పోలీసులు, దేవస్థానం గార్డులు బందోబస్తు నిర్వహించారు. పుష్కరిణి మార్గంలో ఎలాంటి వాహనాలు వెళ్లకుండా పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు.