
మాజీ మంత్రి విడదల రజనిపై పోలీసుల తీరు దారుణం
దేవరాపల్లి: బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి, మహిళా నాయకురాలు విడదల రజని పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ఈర్లె అనురాధ మండిపడ్డారు. కూట మి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ కొరవడిందని, మాజీ మంత్రి రజనిపై పోలీసులు వ్యవహరించి న తీరే ఇందుకు నిదర్శనమన్నారు. తారువలో సోమ వారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ‘సీఐ గారు ఏమిటి విషయమ’ని మర్యాదపూర్వకంగా అడిగిన మాజీ మంత్రిపై సదరు సీఐ దురుసుగా ప్రవర్తించడంతోపాటు ‘నీపై కూడా కేసులు పెడతామం’టూ బెదిరింపులకు దిగడం అత్యంత దారుణమన్నారు. మాజీ మంత్రి పట్ల పోలీసులు ఇలా వ్యవహరిస్తే.. రాష్ట్రంలో సాధారణ మహిళల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. తమ 11 నెలల పాలనలో వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే కూటమి ప్రభుత్వం ప్రశ్నించే వారిపై ఇలా కక్ష సాధింపులకు దిగుతూ, అరాచకంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో మహిళల ను గౌరవిస్తాం, రక్షణ కల్పిస్తామని చెబుతున్న కూటమి నేతలకు మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలు, అరాచకాలు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. పోలీస్ వ్యవస్థకు మచ్చ తెచ్చేలా వ్యవహరించిన సీఐపై చర్యలు తీసుకోవడంతోపాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ఈర్లె అనురాధ డిమాండ్ చేశారు.