
కాన్పు
కొంతమంది వైద్య సిబ్బంది కాసులకు కక్కుర్తి పడి ధర్మాసుపత్రి అర్థాన్నే మార్చేస్తున్నారు. ఇక్కడ ఉచితంగా ప్రసవం చేయాల్సి ఉండగా, గర్భిణులకు ముందుగానే పురిటి కష్టాలు చూపిస్తున్నారు. మూడు నెలల క్రితం డెలివరీ కోసం వచ్చిన వారి నుంచి డబ్బులు గుంజు కున్న గైనిక్ సివిల్ సర్జన్ డాక్టర్ శోభాదేవిని కలెక్టర్ సస్పెండ్ చేయడం తీవ్ర చర్చనీయాం శమైంది. అయినప్పటికీ ఎన్టీఆర్ ఆస్పత్రిలో గైనిక్ విభాగంలో మార్పు కానరాలేదు. సాధారణ కాన్పుకు రూ.3 వేలు, సిజేరియన్‌కు రూ.5 వేలు..అంటూ రేటు పెట్టి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారని గర్భిణులు గగ్గోలు పెడుతున్నారు.
గైనిక్ విభాగంలో ప్రబలుతున్న సమస్యలివే..
సాక్షి, అనకాపల్లి: పండంటి బిడ్డ కోసం నవమాసాలు మోయడం ఒక కష్టం.. నెలలు నిండాక ఆ బిడ్డ తల్లి పొత్తిళ్లలోకి రావాలంటే అది మరింత కష్టం. కాన్పుల కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే స్థోమత లేని పేదోళ్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇలాంటి వారిని వైద్యులు, సిబ్బంది పీడిస్తున్నారు. కాసులు సమర్పిస్తేనే కాన్పు అంటున్నారు. లేదంటే బిడ్డ అడ్డం తిరిగింది.. ఉమ్మనీరు తాగిందంటూ రకరకాల కారణాలు సాకుగా చెప్పి విశాఖలో కేజీహెచ్‌కు రిఫర్ చేస్తున్నారు. అక్కడకు వెళ్లలేని వారు అప్పోసప్పో చేసుకుని ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల డీఆర్‌సీ మీటింగ్‌లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి నేరుగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి, కలెక్టర్ ముందే ఎన్టీఆర్ ఆస్పత్రిలో పేదోళ్ల ప్రసవ వేదన దుస్థితిని ఎండగట్టారు. అయినా ఆస్పత్రి గైనిక్ విభాగంలో అదే తీరు కొనసాగుతోంది.
కాసులు గలగలలాడితేనే
వైద్యం అందేది..
ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రికి అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం, పాయరావుపేట, చోడవరం నియోజకవర్గాల నుంచి రోగులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా.. పేదలు ఉండడం వల్ల వారంతా సాధారణ ప్రసవం కోసం వస్తారు. వారిని కొంతమంది డాక్టర్లు కాసులిస్తేనే కాన్పు చేస్తామని ఇబ్బంది పెడుతున్నారు. సాధారణ కాన్పుకు రూ.3 వేలు, సిజేరియన్లకు రూ.5 వేల వరకూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.
● అనకాపల్లిలో జిల్లా స్థాయి ఎన్టీఆర్ ఆస్పత్రికి అనకాపల్లి, చోడవరం, మాడుగుల, పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాల నుంచి రోగులు వస్తుంటారు. సమీప ప్రాంతాలకు ఇదే పెద్దాసుపత్రి కావడంతో గైనిక్ విభాగంలో ఓపీలు ఎక్కువగా నమోదవుతాయి.
● గైనిక్ వార్డులో ఫ్యాన్లు తిరగక బాలింతలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. జనరేటర్ సదుపాయం ఉన్నా.. అది పది నిమిషాల వరకే పని చేస్తోంది. గైనిక్ వార్డులో ఇన్వెర్టర్ సదుపాయం లేదు.
● స్కానింగ్, ఎక్స్‌రే గదుల్లో ఏసీ సౌకర్యం లేదు.
● నిరంతరం రద్దీగా ఉండే ఆల్ట్రా స్కానింగ్ రూంలో ఒక్కరే రేడియాలజిస్టు అందుబాటులో ఉన్నారు. నెలవారీ చెకప్‌లో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన గర్భిణులను సైతం మూడు గంటలకు పైగా స్కానింగ్ సెంటర్ల ముందు వెయింటింగ్‌లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
● డిస్టిక్ ఆస్పత్రిలో ముగ్గురే గైనిక్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు.
● గర్భిణులకు అల్ట్రా సౌండ్ స్కాన్ చేస్తున్నా.. వారికి రిపోర్టు ఇవ్వడం లేదు. తెల్ల పేపర్‌పై పెన్‌తో రాసి పంపిస్తున్నారు. రేడియాలజీ విభాగం వైద్యులు ఒక్కరే ఉండడంతో రోజువారీ 30 స్కాన్‌లు చేయడం కష్టతరమవుతోంది.
● సర్జికల్ గ్లౌజులు లేవు. రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు చికిత్సలు, ఆపరేషన్ చేసిన సమయంలో కావలసిన కాటన్, ఐవీ క్యానల్, స్కానింగ్ జల్ కొరత ఉంది. కొన్ని రకాల సర్జికల్ వస్తువులు, రోజుకు రూ.3 వేల లోపు సామగ్రి ప్రైవేట్‌గా కొనుగోలు చేస్తున్నారు.
● ఆపరేషన్ సమయంలో కావాల్సిన మందులను ప్రైవేట్ దుకాణంలో రోగులతో కొనుగోలు చేయిస్తున్నారు.
మామూళ్లు తీసుకుంటే విధుల నుంచి తొలగిస్తాం
ఆస్పత్రి మాతాశిశు విభాగంలో గర్భిణులకు ఆపరేషన్ సమయంలో కొంత నగదు తీసుకున్నట్టు వచ్చిన అభియోగాలతో వైద్యురాలిని విధుల నుంచి తొలగించాం. ప్రస్తుత వైద్యులు అటువంటి చర్యలకు పాల్పడడం లేదు. ఎక్కడైనా నగదు తీసుకున్నట్లు మా దృష్టికి వచ్చినట్లయితే తక్షణమే విధుల నుంచి తొలగిస్తాం.
–ఎస్.శ్రీనివాసరావు, ఎన్టీఆర్ ఆస్పత్రి సూపరింటెండెంట్, అనకాపల్లి
కాసులిస్తేనే
ఓపీ ఫుల్.. వైద్యం నిల్
రోజువారీ సగటున ఎన్టీఆర్ ఆస్పత్రికి 600 వరకూ ఓపీ రోగులు వస్తుంటారు. (సోమవారం) 535 ఓపీలు నమోదయ్యాయి. వీరిలో 31 మంది రోగులు అడ్మిట్ అయ్యారు. ఈ ఆస్పత్రిలో 250 నుంచి 300 వరకూ బెడ్స్ సదుపాయం కలదు. వీటిలో కాన్పుల విభాగంలో రోజూ గర్భిణుల ఓపీనే రోజుకు సగటున 200 వరకూ సీ్త్రలకు సంబంధించిన వ్యాధుల ఓపీ ఉంటుంది. రోజూ కాన్పుల కోసం అడ్మిషన్లు 10 నుంచి 20 నమోదవుతున్నాయి.
సాధారణ ప్రసవానికి రూ.3 వేలు, సిజేరియన్‌కు రూ.5 వేలు లేదంటే బిడ్డ అడ్డం తిరిగిందని మెలిక
ఇటీవలే లంచం తీసుకున్న గైనికాలజిస్ట్‌పై వేటు
అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో దందా
గతంలో రోజుకు 300 ఓపీలు, మెటర్నల్ చెకప్‌లు
ఇప్పుడు సగానికి తగ్గిన ఓపీ సంఖ్య
10 నుంచి ముగ్గురికి తగ్గిన గైనిక్ వైద్యులు
ప్రసవ వేదనే..
ప్రసవం కోసం ఎన్టీఆర్ ఆస్పత్రికి పురుడు కోసం వస్తే, వారి నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. సిజేరియన్‌కు సరిపడా సర్జికల్ గ్లౌజులు, కాటన్‌తోపాటు ఇతర వస్తువులను తెచ్చుకోవాలని ప్రైవేట్ మెడికల్ షాపులకు రాస్తున్నారు. వాటి ధర రూ.2 వేల వరకూ ఉంటుంది. డెలివరీ అయి ఇంటికి వెళ్లేసరికి దాదాపుగా రూ.10 వేలు ఖర్చవుతుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఇలా ఖర్చయితే పేదోళ్ల పరిస్థితి ఏంటి? తక్షణమే అధికారులు చొరవ తీసుకుని సరిదిద్దాలి. లేదంటే ఆస్పత్రి రావడానికే భయపడాల్సి పరిస్థితి నెలకొంటుంది.
–కోన కోటేశ్వరి, సామాజిక కార్యకర్త

కాన్పు

కాన్పు