
జూలో ‘సన్’డే సందడి
పోటెత్తిన సందర్శకులు.. రూ.3.62 లక్షల ఆదాయం
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కు ఆదివారం సందడిగా మారింది. విద్యా సంస్థలకు వేసవి సెలవులు రావడం, అందులోనూ ఆదివారం కావడంతో సందర్శకులు పోటెత్తారు. ఎండ తీవ్రత కారణంగా ఎక్కువ సమయం జూ లోపల చెట్ల కిందే గడిపారు. చిన్నారులు చెట్ల నీడలో గంటల తరబడి ఆటలాడుతూ ఎండ వేడిమి కాస్త తగ్గుముఖం పట్టాక జూలో వన్యప్రాణులను తిలకించారు. వాటికి ఫొటోలు తీస్తూ, ఎన్‌క్లోజర్ల వద్ద సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. ఇక్కడ ఏనుగులు, పులులు, కోతులు, జిరాఫీ, జీబ్రాలు, జింకలతో పాటు నెమళ్లు, ఆఫ్రికన్ చిలుకలు, ఆస్ట్రిచ్‌లు, ఈములు వాటి ఎన్‌క్లోజర్లలో ఉదయం, సాయంత్రం సమయంలో హుషారుగా తిరుగుతూ జూకు వచ్చిన పిల్లల్ని, పెద్దలను అలరించాయి. మొసళ్ల జోన్ కొలనులో నీరు వేడెక్కడంతో వాటిలో మొసళ్లు సాయంత్రం వరకు బయటకు రాకుండా అడుగు భాగంలోనే ఉండిపోయాయి. ఆదివారం 4,303 మంది సందర్శించినట్లు జూ క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. వారి ద్వారా రూ 3.62 లక్షల ఆదాయం లభించిందన్నారు.