
కార్గిల్ యోధుడు కనకరాజు
● యుద్ధంలో వీరోచిత పోరాటం చేసిన మునగపాక వాసి ● పాక్ సైనికులతో జరిగిన పోరులో ఛాతీ కింద దూసుకుపోయిన బుల్లెట్ ● ఆర్మీలో సిపాయిగా చేరి.. హవల్దార్‌గా పదవీ విరమణ
మునగపాక: మండల కేంద్రం మునగపాకకు చెందిన కనకరాజు తుపాకీ గుండుకు గుండెను ఎదురొడ్డి కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరుసలిపారు. సరిహద్దులో జరిగిన పోరులో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
మునగపాక గ్రామానికి చెందిన బొయిదాపు సాంభమూర్తి–సత్యవతి దంపతుల పెద్ద కుమారుడు కనకరాజ్. ఐటీఐ పూర్తిచేసి, రిజ్మెంటల్ సెంటర్(ఎంఆర్‌సీ)లో 1994లో శిక్షణలో చేరారు. 1995లో గుజరాత్‌లో సిపాయిగా ఉద్యోగం వచ్చింది. రెండేళ్ల పాటు అక్కడే పనిచేసిన ఆయన 1997–99లో ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పెరేడ్‌లో పాల్గొన్నారు.ఈ పెరేడ్‌లో తన బ్యాచ్ (144)మందితో కలిసి ప్రథమబహుమతిని కై వసం చేసుకున్నారు. 1999లో కూడా తన బ్యాచ్‌తో కలిసి ద్వితీయ బహుమతిని అందుకున్నారు. అదే ఏడాదిలో కాశ్మీరులోని కువ్వాడ జిల్లాకు బదిలీపై వెళ్లారు. అదే సమయంలో కనకరాజ్‌కు లాన్స్ నాయక్‌గా పదోన్నతి లభించింది.అదే ఏడాదిలో మే నుంచి జూలై వరకు జరిగిన కార్గిల్ యుద్ధంలో ఆయన పాల్గొన్నారు. 1999 జూలై 31న భారత సరిహద్దులో పాక్ సైనికులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆయన ఛాతీ దిగువ భాగంలో బుల్లెట్ దూసుకుపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన కనకరాజ్‌ను 428 ఫీల్డ్ అంబులెన్స్‌లో ఆపరేషన్ చేశారు.అయినా ఆరోగ్యం కుదటపడక పోవడంతో శ్రీనగర్ ఆస్పత్రిలో మరోసారి శస్త్ర చికిత్స చేశారు.అది కూడా వికటించింది. ఇన్‌ఫెక్షన్ సోకడంతో గుండె కొట్టుకోవడంలో తేడాలు రావడంతో జమ్మూలోని ఉదంపూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స నిర్వహించి ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. జీర్ణాశయంలో రక్తం గడ్డ కట్టడంతో పేగుకు శస్త్ర చికిత్స నిర్వహించారు.దీంతో సిపాయి ఉద్యోగం చేసే పరిస్థితులు లేకపోవడంతో 2001లో కంప్యూటర్ శిక్షణ పొందారు. నాటి నుంచి రికార్డు ఆఫీసర్‌గా సేవలందించి 2011 అక్టోబర్ 21న హవల్దార్‌గా పదవీ విరమణ చేశారు.
నేటికీ అందని సాయం
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడిన కనకరాజుకు నేటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. దేశం కోసం పనిచేసిన ఉద్యోగులకు ప్రభుత్వం 300 గజాల స్థలాన్ని పట్టణ ప్రాంతాల్లో ఇవ్వాలనే జీవో ఉన్నా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు.దీనికి తోడు మాజీ సైనికుని కోటా కింద 5 ఎకరాల స్థలం కేటాయించాల్సి ఉంది. పదవీ విరమణ నాటి నుంచి ఇంతవరకు పలు మార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని కనకరాజ్ వాపోయారు. కాగా ఉమ్మడి విశాఖ జిల్లాలో మాజీ సైనికులకు సాయం అందించేందుకు ఇటీవల జీవో వచ్చింది. అయితే కనకరాజ్ అనకాపల్లి జిల్లా వాసిగా గుర్తింపు ఉండడంతో ఎటువంటి ఫలం దక్కకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో మాజీ సైనికులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు మాత్రం ఇక్కడ అందకపోవడం విచారకరమన్నారు.

కార్గిల్ యోధుడు కనకరాజు