
పెళ్లిలో ప్రతీకారం !
తాళ్లతో బంధించి ఒకరిని హింసించిన బంధువులు
తగరపువలస: భీమిలి మండలం చిప్పాడ పంచాయతీ ఆశిపాలెంలో నల్ల తాతారావు అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు తాళ్లతో బంధించి హింసించారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై బాధితుడి అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తాతారావును ఆసుపత్రికి తరలించారు. చిప్పాడ పంచాయతీలోని కంచేరుపాలేనికి చెందిన అబ్బాయికి, ఆశిపాలెం యువతితో శుక్రవారం రాత్రి ఆశిపాలెంలో వివాహం జరిగింది. ఈ వివాహానికి అమనాంకు చెందిన నల్ల తాతారావు.. అతని అన్నయ్య అప్పన్న, తల్లి తవుడమ్మతో కలిసి వచ్చారు. వివాహం అనంతరం అప్పన్న, తల్లి అమనాంకు తిరిగి వెళ్లగా.. తాతారావు అక్కడే మంచంపై నిద్రించాడు. దీనిని గమనించిన పెళ్లి కుమార్తె బంధువులు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో తాతారావు కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేసి బంధించారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తాతారావు అన్నయ్య అప్పన్నకు ఈ విషయం తెలియడంతో తన తమ్ముడిని విడిచిపెట్టమని బంధువులను కోరాడు. అయితే వారు నిరాకరించారు. గతంలో తాతారావుకు కంచేరుపాలెం యువతితో వివాహం జరిగింది. వారి మధ్య వివాదాల కారణంగా ప్రస్తుతం తాతారావు అమనాంలో, అతని భార్య కంచేరుపాలెంలో ఉంటోంది. గతంలో తాతారావు తన మామ అనుకుని వేరే వ్యక్తిని తీవ్రంగా కొట్టాడని, అందుకు ప్రతీకారంగానే తాము అతన్ని బంధించామని పెళ్లి కుమార్తె బంధువులు ఆరోపించారు. తాతారావు అన్నయ్య ఫిర్యాదు మేరకు భీమిలి పోలీసులు శనివారం సాయంత్రం సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని విడిపించారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు తన తమ్ముడికి పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా హింసించిన వారిపై చర్యలు తీసుకోవాలని అప్పన్న డిమాండ్ చేశాడు.