
ఎస్సీలకు అమలు కాని ఉచిత విద్యుత్
బుచ్చెయ్యపేట : ఎస్టీ,ఎస్సీల ఉచిత విద్యుత్ పథకానికి కూటమి ప్రభుత్వం మంగళం పాడుతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో 200 యూనిట్ల వరకు ఎస్టీ,ఎస్సీల ఇళ్లకు ఉచిత విద్యుత్ అందజేశారు. కూటమి నాయకులు కూడా ఎస్టీ,ఎస్సీలకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. కాని పలు గ్రామాల్లో ఎస్సీలకు విద్యుత్‌శాఖ అధికార్లు బిల్లులు పంపుతున్నారు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. లోపూడి గ్రామంలో బండి అప్పారావు పేరుపై విద్యుత్ కనెక్షన్ ఉంది (సర్వీస్ నంబర్ 115634ఎల్008000095). ఆ సర్వీస్ నంబర్‌కు ఇటీవల వరకూ ఎటువంటి చార్జీలు పడలేదు. అయితే మార్చి నుంచి విద్యుత్‌శాఖ అధికారులు బిల్లులు పంపుతూ నగదు చెల్లించాలని వత్తిడి చేస్తున్నట్టు అప్పారావు భార్య బండి బోడమ్మ తెలిపింది. మార్చి నెలలో బిల్లు అందించగా ఉచిత విద్యుత్ కదా అంటే, ఈ సారి బిల్లు వచ్చింది డబ్బులు కట్టేయాలని, ఇక బిల్లు రాదన్నారని ఆమె చెప్పింది. దీంతో మార్చిలో రూ.300 కట్టానని, తరవాత ఏప్రిల్,మే నెలల్లో కూడా డబ్బులు కట్టాలని బిల్లులు అందించారని బోడమ్మ వాపోయింది. ఈ నెలలో రూ. 290 కట్టాలని బిల్లు అందించారని తెలిపింది. రెక్కాడితేనే గాని డొక్క నిండని నాలాంటి పేదల నుంచి విద్యుత్ బిల్లులు వసూలు చేయడం తగదని, తనకు బిల్లు రాకుండా న్యాయం చేయాలని ఆమె కోరింది.
మూడు నెలలుగా బిల్లులు వసూలు చేస్తున్న అధికారులు