
ఎన్‌సీసీ శిక్షణ శిబిరంలో విద్యార్థుల ప్రతిభ
పాయకరావుపేట : సూరంపాలెంలో ఈ నెల 1 నుంచి 10వ తేదీ వరకు జరిగిన 3వ ఆంధ్రా ఎన్‌సీసీ బాలికల బెటాలియన్ జూనియర్, సీనియర్ ఉమ్మడి వార్షిక శిక్షణ శిబిరం –1లో నిర్వహించిన వివిధ పోటీల్లో శ్రీ ప్రకాష్ విద్యానికేతన్‌కు చెందిన జూనియర్ వింగ్, శ్రీ ప్రకాష్ జూనియర్ కళాశాలకు చెందిన సీనియర్ క్యాడెట్లు ప్రతిభ కనబరిచారు. ఈ శిబిరానికి ఎనిమిది జూనియర్, ఐదు సీనియర్ వింగ్‌లకు చెందిన మొత్తం 456 మంది క్యాడెట్లు హాజరయ్యారు. పలు పోటీల్లో ప్రతిభ చూపారు. జూనియర్ వింగ్ విభాగంలో సోలో సాంగ్‌లో మొదటి స్థానం, ఖోఖో, చెస్ పోటీల్లో రెండవ స్థానంలో నిలిచి ఒక బంగారు పతకం, పది వెండి పతకాలను, సీనియర్ విభాగంలో బాడ్మింటన్‌లో మొదటి స్థానం, గ్రూప్ సాంగ్, ఖోఖో పోటీల్లో ద్వితీయ స్థానం సాధించి ఒక బంగారు, 13 వెండి పతకాలను సాధించారు. క్యాంప్ కమాండెంట్ కల్నల్ హెచ్‌ఎస్ మౌనిక, గ్రూప్ కమాండర్ రితిన్ మోహన్ అగర్వాల్, ఎస్‌ఎం గులాబ్ సింగ్ చేతుల మీదుగా ఈ పతకాలను అందుకున్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యా సంస్థల అధినేత సీహెచ్.వి.కె. నరసింహారావు, సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయ్ ప్రకాష్ తదితరులు అభినందించారు.