
వివాహం కాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య
కశింకోట: వివాహం కాలేదన్న మనస్తాపంతో ఒడిశా రాష్ట్రానికి చెందిన యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ అల్లు స్వామినాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఉగ్గినపాలెం వద్ద గల బాటిల్స్ ప్రాసెసింగ్ యూనిట్‌లో ఒడిశాకు చెందిన అర్జు పాంగి (25) కూలీగా పని చేస్తున్నాడు. అతని అన్నదమ్ములకు వివాహం అయింది. అర్జుకు మాత్రం వివాహం కాకపోవడంతో మనస్తాపం చెంది తాను నివాసం ఉంటున్న గదిలో శుక్రవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శబ్దాలు విని అనుమానించి పక్క గదిలో వారు గ్రామ పెద్దలను తీసుకు వచ్చి తలుపు తెరిచి చూసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని ఏఎస్‌ఐ శ్రీనివాస్ సందర్శించి, మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.