
సరుగుడులో లేటరైట్ తవ్వకాలు
నర్సీపట్నం: నాతవరం మండలం సరుగుడు ప్రాంతంలో కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా లేటరైట్ తవ్వకాలు చేపడుతుందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.వెంకన్న శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ ప్రాంతంలోని 30 వేల ఎకరాల్లో లేటరైట్ తవ్వకాల అనుమతుల కోసం 2013లో బినామీలు పేరున దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిలో కొయ్యూరు మండలం కాకరపాడుకు చెందిన గిరిజనేతరుడు జర్తా లక్ష్మణరావుకు 121 ఎకరాల్లో అప్పట్లో అనుమతులు ఇవ్వగా, తాము తీవ్రంగా వ్యతిరేకించామన్నారు. సదరు లీజుదారు గిరిజనుడు కాదని రుజువు కావడంతో మైనింగ్ తవ్వకాలు నిలిచిపోయాయన్నారు. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం 296,34 హెక్టార్లల్లో మైనింగ్ వ్యాపారులు తవ్వకాలు చేస్తున్నారన్నారు. వీటి వల్ల పోడు వ్యవసాయం, కొండ కింద పండించే వరి, ఇతర ఆహార పంటలకు నీటి వసతి లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ హక్కుల చట్టాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. తవ్వకాల ప్రాంతంలో వివిధ రకాల చెట్లు, అడవి ధ్వంసమవుతున్నాయన్నారు. కొన్ని వందల అడుగులు మేర లేటరైట్ తవ్వకాలు చేపట్టి, పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని వాపోయారు. సిమెంట్ తయారీకి, ఇతర నిర్మాణ అవసరాలకు ఉపయోగిస్తున్న లేటరైట్‌కు డిమాండ్ ఉండడంతో మైనింగ్ మాఫియా అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడుస్తుందని ధ్వజమెత్తారు. ఈ తవ్వకాల వల్ల అసనగిరి, సిరిపురం, ముంతమామిడి, భమిడికలొద్ది, తొరడ, ఎరకంపేట, సరుగుడు, సుందరకోట, కిండంగి, తదితర గ్రామాల గిరిజనులకు నష్టం జరుగుతుందన్నారు. వీరిని ప్రలోభ పెట్టేందుకు లేటరైట్ లీజుదారుని వెనుక ఉన్న నర్సీపట్నానికి చెందిన మైనింగ్ వ్యాపారి డబ్బులు ఆశ చూపుతున్నారని ఆరోపించారు. గిరిజనులను వర్గాలుగా చీల్చి అక్రమంగా లేటరైట్ తవ్వకాలు చేస్తున్నారని, వెంటనే మైనింగ్ లీజులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
గిరిజనుల జీవనోపాధికి దెబ్బ
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకన్న

సరుగుడులో లేటరైట్ తవ్వకాలు