
సింహాచలం దేవస్థానం ఇన్‌చార్జి ఈవోగా సుజాత
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఇన్‌చార్జి ఈవోగా దేవదాయశాఖ విశాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్.సుజాత నియమితులయ్యారు. ఈ మేరకు ఆమెకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ సెక్రటరీ వి.వినయ్‌చంద్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. కాగా ఇప్పటివరకు ఇన్‌చార్జి ఈవోగా పనిచేసిన కె.సుబ్బారావును ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇదిలావుండగా దేవస్థానం పర్మినెంట్ ఈవోగా ఉన్న వి.త్రినాథరావు వ్యక్తిగత కారణాల వల్ల అమెరికా వెళ్లేందుకు ఈ ఏడాది మార్చి 1 నుంచి మే 30 వరకు సెలవు పెట్టారు. దీంతో రెవెన్యూ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చి దేవదాయశాఖ రాజమహేంద్రవరం జోన్–1 ఆర్‌జేసీగా పనిచేస్తున్న కె.సుబ్బారావుకు 92 రోజులపాటు ఇన్‌చార్జి ఈవోగా పూర్తి బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. దీంతో ఆయన మార్చి ఒకటో తేదీన ఇన్‌చార్జి ఈవోగా బాధ్యతలు స్వీకరించగా.. ఈనెలాఖరుకు పదవీకాలం పూర్తవుతుంది. గత నెల 30న చందనోత్సవం రోజు గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటనలో ఆయన సస్పెండ్ అయ్యారు. ఈనెలాఖరుతో దేవస్థానం పర్మినెంట్ ఈవో వి.త్రినాథరావు 92 రోజుల సెలవు కూడా పూర్తవుతుంది. ఆయన తిరిగి ఈవోగా బాధ్యతలు స్వీకరిస్తారా..లేదా.. అన్న చర్చ దేవస్థానంలో నడుస్తోంది.