
యుద్ధకాలపు అనుభవాలు
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో విశాఖపై జపాన్ దాడి తప్పదని ముందుగానే ఊహించారు. 1942 జనవరిలో బర్మా, ఫిబ్రవరిలో సింగపూర్‌లను జపాన్ ఆక్రమించడంతో, వారి తదుపరి లక్ష్యం భారతదేశ తూర్పు తీరంలోని కీలక నగరమైన విశాఖపట్నం అని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో నగరంలోని యూరోపియన్లు రైళ్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ముందు జాగ్రత్త చర్యగా విశాఖపట్నం అంతటా బంకర్లు నిర్మించారు. వీటిలో కొన్ని ఆర్‌కే బీచ్ పరిసరాలు, దస్‌పల్లా హిల్స్ ప్రాంతాల్లో ఇప్పటికీ చూడవచ్చు. రేషన్ సరుకులను నిల్వ ఉంచుకోరాదని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఆ సమయంలో నెలకొన్న పరిస్థితులను భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంపద(ఇన్‌టాక్) సంస్థకు చెందిన ఎడ్వర్డ్ పాల్ ‘సాక్షి’కి వివరించారు. ‘దాడిని ఎదుర్కొనేందుకు నగరంలో సరైన ఆయుధ సంపత్తి లేదు. జపాన్ సైన్యం టెలిఫోన్ ఎక్స్ఛేంజ్, పవర్ హౌస్‌లతో పాటు హార్బర్‌లోని నౌకలపై బాంబులు వేసింది. ఈ దాడిలో ఎనిమిది మంది మరణించారు. దాడి జరుగుతున్న సమయంలో, నౌకల్లోని పాత తుపాకులతో ఎదురుదాడికి ప్రయత్నించినా.. జపాన్ విమానాలు వాటి పరిధిలో లేకపోవడంతో అవి నిష్ఫలమయ్యాయి. పోర్టు నగరంపై దాడి జరుగుతుందని తెలిసినప్పటికీ తగిన ఆయుధాలను మోహరించలేదని ఇది స్పష్టం చేస్తుంది. ఆనాటి దాడిలో మరణించిన వారి పేర్లతో కూడిన శిలాఫలకాన్ని విశాఖపట్నం మ్యూజియంలో, అలాగే జారవిడిచిన ఒక పేలని బాంబును కూడా మ్యూజియంలో భద్రపరిచారు. ప్రజలు ఎడ్లబళ్లు, సైకిళ్లు, కాలినడకన నగరాన్ని విడిచి వెళ్లారు. అధికారులు మాత్రం తమ కుటుంబ సభ్యులను గ్రామాలకు పంపి.. విధుల్లో కొనసాగారు. ఆంధ్రా యూనివర్సిటీ భవనాలను ఖాళీ చేయించి బ్రిటిష్ సైన్యం వినియోగించుకుంది. యూనివర్సిటీని తాత్కాలికంగా గుంటూరు, విజయవాడలకు తరలించారు.’ అని పాల్ వివరించారు. అయితే 1971 నాటి పాకిస్తాన్‌తో యుద్ధ సమయంలో విశాఖపట్నంపై పెద్దగా ప్రభావం పడలేదన్నారు. 1942 నాటి ఘటనతో విశాఖపట్నంనకు రెండు ప్రయోజనాలు చేకూరాయని పేర్కొన్నారు. నగరానికి వచ్చిన సైనిక బలగాల నీటి అవసరాలను తీర్చడానికి ఆర్మీ ఇంజినీర్లు గోస్తనీ తాగునీటి పథకాన్ని నిర్మించారు. రోజుకు 4 లక్షల గ్యాలన్ల నీటిని సరఫరా చేసే ఈ పథకాన్ని యుద్ధానంతరం మున్సిపాలిటీ వినియోగించుకుంది. అలాగే మేహాద్రి గెడ్డపై ఒక వంతెనను కూడా నిర్మించారని ఆనాటి సంగతులను పంచుకున్నారు.

యుద్ధకాలపు అనుభవాలు

యుద్ధకాలపు అనుభవాలు