
టీడీపీ సర్పంచ్ భర్త వేధింపులపై హోంమంత్రికి ఫిర్యాదు
ఎస్.రాయవరం: జేవీ పాలెం గ్రామంలోని తన భూమిలో మట్టిని ప్రస్తుత టీడీపీ సర్పంచ్ భర్త, మాజీ సర్పంచ్ వజ్రపు శంకరరావు దౌర్జన్యంగా తరలించుకుపోతున్నాడని గ్రామానికి చెందిన అన్నం కాంతం ఓ వీడియో ద్వారా రాష్ట్ర హోంమంత్రి అనితకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. 2016 నుంచి తన భూమిలోకి అక్రమంగా చొరబడి గ్రావెల్ తరలించుకుపోయి సొమ్ము చేసుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ.50 వేలు వ్యయంతో నిర్మించుకున్న రేకుల షెడ్డును కూడా శంకరరావు కూల్చివేసి తనకు ఆర్థికంగా నష్టాన్ని చేకూర్చాడని ఆమె ఆరోపించారు. ఈ సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తాను పోలీస్ స్టేషన్‌కు వెళ్లే లోపే ఫిర్యాదు తీసుకోవద్దని అధికారం అండతో అడ్డుపడుతున్నాడని ఆమె వాపోయారు. పోలీసులు కూడా న్యాయ, అన్యాయాలు పరిశీలించకుండా కూటమి పార్టీ నేత అయిన శంకరరావుకే వస్తాసు పలుకుతున్నారన్నారు. ఈ మేరకు హోంమంత్రికి ఫిర్యాదు చేస్తున్నట్టు ఆమె చెప్పారు. హోంమంత్రి అండదండలు తనకు మెండుగా ఉన్నాయని, గ్రామంలో ఏ చేసినా చెల్లిపోతుందని శంకరరావు రెచ్చిపోతున్నాడన్నారు. ఇటీవల గ్రామ సభలో తాను ఫిర్యాదు చేస్తే సర్పంచ్ దురుసుగా ప్రవర్తించాడని, ఆ ఘటనను తన మనవడు వీడియో తీస్తే, రూ.20 విలువ చేసే మొబైల్ లాక్కుని పోయాడని చెప్పారు. ఇప్పటికై నా హోంమంత్రి పరిశీలించి శంకరరావు ఆకృత్యాలకు అడ్డుకట్ట వేసి తనకు న్యాయం చేయాలని ఫిర్యాదులో కోరారు.