
గిరిజన గ్రామాలకు పండగొచ్చింది..
వై ఆకారంలో వీబీపేట నుంచి కొండెంపూడి గొప్పూరు వెళ్లే రోడ్లు విభజన జరిగిన ప్రాంతం
చీడికాడ: మండలంలోని శివారు పంచాయతీ వీరభద్రపేట పరిధిలో కొండెంపూడి, గొప్పూరు, ముడిచర్ల, జైపురం గిరి గ్రామాలు ఉన్నాయి. ఇవి వీరభద్రపేట నుంచి ఐదారు కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి. ఆ గ్రామస్తులు ఏ చిన్న వస్తువు కొనుక్కోవాలన్నా వీరభద్రపేట రావాలి. గ్రామస్తులు బయట ఊళ్లకు వెళితే కచ్చితంగా సాయంత్రంలోగా వెనుదిరగాలి. చీకటి పడితే సరైన రహదారి సౌకర్యం లేక రాత్రి వీరభద్రపేటలో గడిపి ఉదయాన్నే గ్రామాలకు వెళ్లాలి. ఇదీ వారి పరిస్థితి. రాత్రి సమయాల్లో విష పురుగులు కుట్టినా, ప్రమాదాలు సంభవించినా, గర్భిణులకు నొప్పులు ప్రారంభమైనా భగవంతునిపై భారం మోపి ఉదయం వరకు వేచి డోలీ మోతలతో తీసుకురావాల్సి ఉండేది. గతంలో కొందరు మృత్యువాత పడ్డారు. ఈ మొత్తం నాలుగు గ్రామాల్లో 250 మంది జనాభా ఉండడంతో గత ప్రభుత్వాలు ఓటుబ్యాంకు రాజకీయాలతో వీరిని పట్టించుకోలేదు. శివారు గ్రామాలకు మెరుగైన రహదారి ఉంటే విద్య, వైద్యం, మెరుగైన మౌలిక వసతులు అందించి ఆదుకోవచ్చన్న జగన్‌మోహన్‌రెడ్డి దార్శనికతతో ఇన్నాళ్లకు వారికి మంచి రోజులు వచ్చాయి. మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు చొరవ తీసుకోవడంతో వైఎస్ జగన్ సర్కారు దండిగా నిధులు మంజూరు చేసింది. నాడు వేసిన బీజం నేడు వారికి మంచి ఫలాలను అందించింది. తళతళలాడే తారు రోడ్లు ముచ్చటగొలిపేలా కనిపిస్తున్నాయి. రహదారి అందుబాటులోకి రావడంతో ఆ నాలుగు గిరిజన గ్రామాలలో గిరిజన సంపదతో పాటు వీరభద్రపేట గ్రామ రైతుల పంటలు చేర్చుకునే వెసులుబాటు కలిగింది.
అందుబాటులోకి వచ్చిన వీరభద్రపేట–కొండెంపూడి–వీరభద్రపేట–గొప్పూరు తారురోడ్డు
మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దార్శనికత ఫలితం నాలుగు శివారు గిరి గ్రామాలకు తీరిన రహదారి కష్టం మాజీ డిప్యూటీ సీఎం బూడి చొరవతో రూ.5.65 కోట్ల నాబార్డు నిధులు రోడ్లు అందుబాటులోకి రావడంతో గిరి ప్రజల ఆనందం
డోలీ మోతలకు స్వస్తి
నా చిన్నప్పటి నుంచి మాకు రోడ్డు ఉంటే బాగుండును అనుకునే వాళ్లం. ఎన్నికల సమయంలో మా గ్రామానికి ఓట్ల కోసం వచ్చే నాయకులకు మాకు రోడ్డు వెయ్యండని చెప్పేవాళ్లం. హామీ ఇచ్చి తర్వాత మరిచిపోయేవాళ్లు. మా తల రాత ఇంతేనని మేం అడగడం మానేశాం. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మా బాధని మా నాయకుల ద్వారా బూడి ముత్యాలనాయుడుకు చెప్పాం. రోడ్డు వేస్తానని చెప్పారు. మాట నిలబెట్టుకున్నారు. మేం ఎప్పటికీ జగనన్నకు రుణపడి ఉంటాం. మా గ్రామాల్లో డోలీ మోతల బాధలు తీరి మా వారి ప్రాణాలకు ఊతం దొరికింది.
– బోళం రాము, వార్డు సభ్యుడు, కొండెంపూడి గ్రామం

గిరిజన గ్రామాలకు పండగొచ్చింది..