
అక్షరంపై కక్షసాధింపా?
అనకాపల్లి: ఎలాంటి అనుమతులు, సమాచారం లేకుండా సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి నివాసంలో పోలీసులు అక్రమంగా ప్రవేశించి సోదాలు చేయడాన్ని పలు జర్నలిస్టు సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అక్రమాలు, అవినీతిని సాక్షి వెలుగులోకి తెస్తుండడంతో కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే పోలీసులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా అంతటా పాత్రికేయులు నిరసన ప్రదర్శనలు చేసి, అధికారులకు వినతి పత్రాలు అందించారు. ముందస్తు సమాచారం లేకుండా సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిలో పోలీసులు అక్రమంగా సోదాలు నిర్వహించడం దారుణమని ఏపీయూడబ్ల్యూజే అనకాపల్లి అధ్యక్షుడు మళ్ల భాస్కరరావు అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో షేక్ ఆయిషాకు యూనియన్ ఆధ్వర్యంలో గురువారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు ఒక ప్రముఖ దినపత్రిక ఎడిటర్‌తో దురుసుగా ప్రవర్తించడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వం అక్రమాలు, అవినీతిని సాక్షి వెలుగులోకి తీసుకొస్తోందన్న అక్కసు, కక్షతో పోలీసులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ చర్యలకు దిగినట్లు పాత్రికేయ సంఘాలు భావిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇటువంటి చర్యలను నిలిపివేయాలన్నారు. యూనియన్ పట్టణ ప్రధాన కార్యదర్శి భీమరశెట్టి గణేష్, యూనియన్ జిల్లా కార్యదర్శి ఎ.వెంకట అప్పారావు, పాత్రికేయులు కర్రి గంగాధర్, పెంటకోట సత్యనారాయణ, పి.వీరబాబు, బి.మధుసూదనరావు, వేగి రామచంద్రరావు, పి.సాయి తదితరులు పాల్గొన్నారు.
సాక్షిపై ప్రభుత్వం కక్ష సాధింపు
నర్సీపట్నం: సాక్షిపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని ఏపీయూడబ్ల్యూజే ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు సిహెచ్‌బిఎల్ స్వామి, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కిషోర్ చింతల పేర్కొన్నారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి నివాసంలో పోలీసులు అక్రమంగా చొరబడి సోదాలకు పాల్పడటాన్ని నిరసిస్తూ పాత్రికేయులు ఆర్డీవో కార్యాలయం ఇన్‌చార్జి ఏవో కె.అశోక్‌కు వినతిపత్రం అంజేశారు. ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీ ప్రభాకర్, సాక్షి స్టాఫ్ రిపోర్టర్ లోవరాజు, పాత్రికేయులు అప్పారావు, నానాజీ, ఎ.డి.బాబు, పాండురంగారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కలం గొంతు నొక్కితే ఉద్యమిస్తాం
సాక్షి ఎడిటర్ ఇంట్లో సోదాలపై జర్నలిస్టు సంఘాల నిరసన
కూటమి సర్కార్ తీరును ఎండగట్టిన పాత్రికేయులు

అక్షరంపై కక్షసాధింపా?