
కష్టాలు చూడలేని కబోది ప్రభుత్వం
కళ్లకు గంతలతో కమ్యూనిటీ హెల్త్ వైద్య సిబ్బంది వినూత్న నిరసన
అనకాపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్‌సీల పరిధిలో విధులు నిర్వహిస్తున్న కమ్యూనిటీ హెల్త్ వైద్య సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని గత 12 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకుండా పోయిందని ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ వి.వి.శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కమ్యూనిటీ హెల్త్ వైద్య సిబ్బంది కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని గురువారం వినూత్న నిరసన తెలియజేశారు. తమ కష్టాలు చూడలేని కబోది ప్రభుత్వమని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలని కోరారు. కమ్యూనిటీ హెల్త్ వైద్య సిబ్బందికి ఆరేళ్లకే పర్మినెంట్ చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కమ్యూనిటీ హెల్త్ వైద్య సిబ్బంది భవాని, యమున, లక్ష్మి, సంధ్య తదితరులు పాల్గొన్నారు.