
హోంగార్డు కుటుంబానికి రూ.4.26 లక్షల సాయం
అనకాపల్లి: పోలీస్ శాఖలో హోంగార్డు సేవలు అభినందనీయమని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన హోంగార్డు అర్లబు నారాయణ భార్య పార్వతమ్మకు హోంగార్డుల ఒక రోజు వేతనాన్ని గురువారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో తుహిన్ సిన్హా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సబ్ డివిజన్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో నారాయణ ఇటీవల మృతి చెందారన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల ఒక రోజు వేతనం రూ.4,26,385 చెక్కును మృతుడి భార్యకు అందజేశారన్నారు. విధి నిర్వహణలో మృతి చెందిన, పదవీ విరమణ పొందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు మిగతా హోంగార్డులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయంలో ఏవో రామ్‌కుమార్, జూనియర్ అసిస్టెంట్ టి.రమేష్, తదితరులు పాల్గొన్నారు.