
మున్సిపల్ వైస్ చైర్మన్‌లపై అవిశ్వాసం నోటీసు
యలమంచిలి రూరల్: యలమంచిలి మున్సిపల్ వైస్ చైర్మన్‌లు బెజవాడ గోవిందరాజు నాగేశ్వరరావు, అర్రెపు నాగ త్రినాథ ఈశ్వర గుప్తాలపై అవిశ్వాసం కోరుతూ జిల్లా కలెక్టర్‌కు గురువారం వార్డు కౌన్సిలర్లు నోటీసు ఇచ్చారు. ఇందుకోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బల పరీక్ష నిర్వహించాలని నోటీసులో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ముఖ్యమైన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉండడంతో జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణకు నిర్దేశిత ప్రొఫార్మాలో పూరించిన ఫారాన్ని అందజేశారు. నోటీసుపై 17 మంది వార్డు కౌన్సిలర్ల సంతకాలు ఉన్నాయి. యలమంచిలి మున్సిపాలిటీలో మొత్తం 25 మంది వార్డు కౌన్సిలర్లు ఉండగా.. 23 మంది వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యులు, టీడీపీకి ఒకరు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వార్డు కౌన్సిలర్లను ప్రలోభపెట్టిన కూటమి నాయకులు ఇటీవల కొద్దిరోజుల క్రితం మున్సిపల్ చైర్‌పర్సన్ పిళ్లా రమాకుమారిపై వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం వీగిపోయేలా చేసిన సంగతి తెల్సిందే. తాజాగా వైఎస్సార్‌సీపీ తరఫున కొనసాగుతున్న మున్సిపల్ వైస్ చైర్మన్లపై వార్డు కౌన్సిలర్లు అవిశ్వాసం కోరుతూ నోటీసు ఇవ్వడం చర్చనీయాశంగా మారింది. ఈ విషయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.