
కుట్టు శిక్షణలో అవినీతిపై దర్యాప్తు చేయాలి
అనకాపల్లి: బీసీ మహిళల కుట్టు శిక్షణలో రూ.245 కోట్లలో సుమారుగా రూ.167 కోట్లు అవినీతికి పాల్పడిన వ్యక్తులపై కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు ఉద్దండం త్రినాథరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక కలెక్టర్ కార్యాలయంలో జేసీ జాహ్నవి గురువారం ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ మహిళలకు కుట్టు శిక్షణ ఇవ్వడం అభినందనీయమని, మిషన్ల కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలన్నారు. మొత్తం బీసీ లబ్ధిదారులు లక్ష మందికి ఒక్కొక్కరికి రూ.23 వేలు చొప్పున ఖర్చు అవుతుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక బీసీ లబ్ధిదారునికి కుట్టు మిషన్, శిక్షణకు అయ్యే మొత్తం ఖర్చు రూ.7,300 అవుతుంటే మొత్తం లక్ష మంది మహిళలకు రూ.73 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. అయితే ఈ శిక్షణలో జరిగిన రూ.167 కోట్ల అవినీతిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకుముందు రింగ్ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో త్రినాథరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి జెడ్పీటీసీ సేనాపతి సంధ్యారాము, పార్టీ యలమంచిలి బీసీసెల్ అధ్యక్షుడు బి.చల్లయ్య నాయుడు, పార్టీ సీనియర్ నాయకులు కర ణం వెంకటరమణ, యల్లపు గాంధీ, మొగలిపల్లి సుబ్బారావు, దాడి నారాయణరావు, జామి వెంకటరమణ, సింహాద్రి రమణ పాల్గొన్నారు.