
ఏలేరు కాలువలో పడి ఎలక్ట్రీషియన్ మృతి
కశింకోట: కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి ఏలేరు కాలువలో పడి ఓ ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. మండలంలోని బంగారయ్యపేటలో తాళ్లపాలెం శివారు బంగారయ్యపేట వద్ద ఈ సంఘటన జరిగింది. సీఐ అల్లు స్వామినాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. బంగారయ్యపేటకు చెందిన ఓయిబోయిన లక్ష్మణరావు (40) సమీపంలోని ఏలేరు కాలువ వద్దకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి మంగళవారం వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు కాలువలో జారి పడి మునిగి గల్లంతయ్యాడు. బుధవారం రామన్నపాలెం వద్ద మృతదేహం బయటపడింది. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ కె.రమణమ్మ సందర్శించి, మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి పోస్టుమార్టానికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.