
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
అనకాపల్లి టౌన్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రావణి తెలిపారు. ఈ మేరకు స్థానిక డీఎస్పీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అనకాపల్లి మండలం, పట్టణంలో ఈ నెల 1న జరిగిన వరుస మూడు దొంగతనాలపై అందిన ఫిర్యాదు మేరకు ఎస్‌సీ ఆదేశాలతో ప్రత్యేక పోలీస్ టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. గ్రామీణ సీఐ అశోక్‌కుమార్, ఎస్‌ఐ రవికుమార్ నేతృత్యంలో టీమ్‌లు ఆధునిక సాంకేతికత సహాయంతో దొంగలను బుధవారం మారేడిపూడి జంక్షన్‌లో అదుపులోకి తీసుకున్నారన్నారు. తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు(24), ఉప్పల సురేష్(30), కందివలస నరసింహారావు(39), జనార్దన్(30), కంకణాల సుభాష్(19) పాత కేసుల్లో జైలులో ఉన్నప్పుడు పరిచయాలు పెంచుకొని ఐదుగురు ముఠాగా ఏర్పడ్డారని తెలిపారు. వీరంతా గుంటూరు జిల్లాకు చెందిన వారని, ఆటో డ్రైవర్లుగా జీవనం సాగిస్తూ డబ్బు అవసరమైనప్పుడు దొంగతనాలకు పాల్పడుతుంటారని ఆమె వివరించారు. నిందితులను విచారించగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించినట్టు డీఎస్పీ తెలిపారు. వారి నుంచి మూడు దొంగతనాలకు సంబంధించి తులం పావు బంగారం ఆభరణాలు, రూ.1.05 లక్షల నగదు, యాపిల్ ఐఫోన్, రెండు కేజీల వెండి వస్తువులు, ల్యాప్‌టాప్, కారు తాళాలు, పట్టుచీరల బ్యాగ్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. హైదరాబాద్‌కు సంబంధించిన పలు దొంగతనాలలో ఐదు గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి స్వాధీనం చేసుకోగా, రూ.1.30 లక్షలు జల్సాలకు విజయవాడలో ఖర్చు చేశారని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించామన్నారు.