
విద్యార్థి దశ నుంచే ఉద్యమంలోకి...
సీలేరు: కాకూరి పండన్న అలియాస్ జగన్. అలియాస్ అండు.. అలియాస్ బీరును. అలియాస్ బీమ ఇన్ని పేర్లు కలిగిన వ్యక్తి మావోయిస్టు పార్టీలో కీలక నేత. పాఠశాలలో చదువుకుంటున్న తరుణంలో మావోయిస్టు పార్టీకి ఆకర్షితుడై ఉద్యమంలోకి అడుగుపెట్టాడు. 30 ఏళ్ల నుంచి మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా ఎదిగాడు. ఆయనది గూడెం కొత్తవీధి మండలం దుప్పులవాడ పంచాయతీ కొమ్ములవాడ. తల్లి పేరు సీతమ్మ. ముగ్గురు సంతానంలో పెద్ద కొడుకు సోమన్న ఇప్పటికే మృతి చెందగా రెండవ కొడుకు కాకూరి పండన్న అలియాస్ జగన్ ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో ఉంటూ ఎదురు కాల్పుల్లో మృతి చెందాడు. మూడో కొడుకు అప్పన్న ప్రస్తుతం స్వగ్రామం కొమ్ములువాడలో ఉంటున్నారు.
తల్లి వేడుకున్నా..
ఏడాది క్రితం తల్లి సీతమ్మ మృతి చెందింది. ఆమెకు పోలీసులు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె ఎన్నోసార్లు కొడుకుని చూడాలని.. ఉద్యమాన్ని వీడి రావాలని వేడుకున్నా జగన్ రాలేదు. పోలీస్ శాఖ పలుమార్లు లొంగిపోవాలని, పునరావాసం కల్పిస్తామని ప్రకటన చేసినా ఆయన ఉద్యమం నుంచి బయటకు రాలేదు. ఆయన వయసు 65 సంవత్సరాలు పైబడి ఉంటుందని పోలీసులు గతంలోనే నిర్ధారించారు. ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతాలపై గట్టి పట్టు ఉన్న పండన్న పలుమార్లు పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారు. 2021లో తీగల మెట్ట అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పుల్లో అతను తప్పించుకున్నట్లు పోలీస్ రికార్డులో నమోదయింది. తల్లి మృతి చెందాక.. ఐదు నెలల క్రితం పండన్న తన అనుచరులతో స్వగ్రామమైన కొమ్ములవాడ గ్రామానికి వచ్చి బంధువులు, గ్రామస్తులతో మాట్లాడి భోజనం చేసి వెళ్లాడు. ఇది తెలుసుకున్న పోలీసులు చుట్టుముట్టినప్పటికీ వారి కంట పడకుండా తప్పించుకున్నాడు. అప్పట్నుంచి కాకూరి పండన్నను ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు కంకణం కట్టుకున్నారు. ఈనేపథ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో పండన్న ప్రాణాలు కోల్పోయాడు.