
ప్రకృతి వ్యవసాయంతో రైతులకు ఎంతో మేలు
చోడవరం: ప్రకృతి వ్యవసాయంతో నేల సారవంతంగా తయారవ్వడంతో పాటు రైతులకు మంచి పంట దిగుబడి వస్తుందని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ లచ్చన్న తెలిపారు. మండలంలో చాకిపల్లి గ్రామంలో సర్పంచ్ ఏడువాక సత్యారావు ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమౌతున్న సమయంలో రైతులకు ప్రకృతి వ్యవసాయం ద్వారా కలిగే ఉపయోగాలను ఈ సందర్భంగా వివరించారు. పంటకు కావలసిన సూక్ష్మ, స్థూల పోషకాలు అందుబాటులోకి వస్తాయన్నారు. నవధాన్యాలు సాగుచేయడం వల్ల పశువులకు మంచిన పోషకాహారం కూడా లభిస్తుందన్నారు. నేల గుల్లబారి వానపాములు అభివృద్ధి చెందుతాయని, నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందన్నారు. తొలకరి వర్షాలకు ముందే ప్రకృతి వ్యవసాయం విధానంలో భూమిని సంరక్షిస్తే ఏడాదంతా పంటకు మేలు చేస్తుందని సూచించారు. మిశ్రమ పంటలు వేయడం వల్ల రైతులకు అదనపు ఆదాయం వస్తుందని, ప్రధానంగా రసాయన ఎరువుల వినియోగం పూర్తిగా తగ్గించాలన్నారు. ఈ సందర్భంగా రైతులకు సబ్సిడీపై అపరాలు, నవధాన్యాల విత్తనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్లూమ్ జిల్లా ఇన్‌చార్జి గోవిందరావు, ఎన్‌ఎఫ్‌ఏ నాగమణి, నాయుడుబాబు, కాండ్రేగుల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.