
దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి
అనకాపల్లి: ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు వ్యతిరేకంగా ఈనెల 20న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఒక రోజు సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకరరావు అన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో బుధవారం సమ్మె పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారని, కార్మికులకు ఎటువంటి హక్కులు లేకుండా చేశారని తెలిపారు. నాలుగు లేబర్ కోడ్స్ కి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడాలన్నారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని, ఉపాధి హామీ పథకం వేతనదారులకు 200 రోజుల పాటు పనికల్పించి, రోజుకు రూ.600 చొప్పున కూలి చెల్లించాలని. స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, భవన నిర్మాణ, ఆటో, ముఠా కార్మికులకు సమగ్ర చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కె.లోకనాథం, రాష్ట్ర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా కోశాధికారి వి.వి. శ్రీనివాసరావు, సీపీఎం మండల కార్యదర్శి గంటా శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.