మాయాబజార్‌ | - | Sakshi
Sakshi News home page

మాయాబజార్‌

Mar 15 2025 1:58 AM | Updated on Mar 15 2025 1:57 AM

కళ్ల ముందే కనికట్టు.. తూకంలో తేడాలున్నా కనిపెట్టకుండా హస్తలాఘవం.. కూరగాయలు, కిరాణా, బెల్లం, చేపలు, మాంసం, పండ్లు.. ఇలా ఏది కొన్నా అనకాపల్లిలో ఎంతో కొంత నష్టపోవలసిందే. తూనికలు కొలతల శాఖ అధికారులు ఉండే జిల్లా కేంద్రంలోనే యథేచ్ఛగా మాయ చేస్తున్నారంటే జిల్లావ్యాప్తంగా వినియోగదారులు ఎంత నష్టపోతున్నారో అర్థమవుతోంది. కళ్ల ముందే తూకంలో మోసం జరిగినా వినియోగదారులు గుర్తించలేని విధంగా వ్యాపారులు తమ చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో బెంబేలెత్తిపోతున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలను తూకంలో తేడాలు మరింత కలవరపెడుతున్నాయి. నాణేనికి బొమ్మ, బొరుసు ఉన్నట్టే కచ్చితమైన తూకంతో అమ్మేవారూ ఉన్నారు. కానీ ఏది రైటో ఏది తప్పో తెలుసుకోలేని అయోమయ స్థితి నెలకొంటోంది. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ క్షేత్ర స్థాయి పరిశీలన చేసింది. ఇందులో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.

తూకంలో తేడాలు.. జనం జేబుకు చిల్లులు

కిలోకు 100 గ్రాముల వరకు తగ్గుదల

డిజిటల్‌ వేయింగ్‌ మెషీన్‌లోనూ మోసాలు

తూతూమంత్రంగా లీగల్‌ మెట్రాలజీ దాడులు

మార్కెట్‌లో 30 శాతానికి పైగా మోసపూరిత వ్యాపారులే..

వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడి

డిజిటల్‌ వేయింగ్‌ మెషీన్లలోనూ మోసం

డిజిటల్‌ వేయింగ్‌ మెషీన్‌లోనూ మోసం చేసే ఆస్కారముంది. మెషీన్‌ క్యాలిబ్రేషన్‌ సెట్‌ చేయడం ద్వారా 1000 గ్రాములకు వారు అనుకున్నంత 900, 800 గ్రాముల వరకు సెట్‌ చేసుకోవచ్చు. ఇది ఒకసారి సెట్‌ చేస్తే అలానే ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రానిక్‌ యంత్రాన్ని లీటర్‌ మోడ్‌లో పెట్టి తూకం చేస్తున్నారు. అందులో వెయ్యి గ్రాములు కాకుండా వెయ్యి అని మాత్రమే చూపిస్తోంది.

తక్కెడలు, తూకపు రాళ్ల లెక్కలు లేవు..

జిల్లా కేంద్రంలో తూనికలు, కొలతల శాఖ కార్యాలయం ఉంది. ఒక అసిస్టెంట్‌ కంట్రోలర్‌, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. నెలలో ఒక్కసారైనా దుకాణాల్లో తనిఖీలు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం వ్యాపారులకు ఇష్టారాజ్యంగా మారింది. తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలకు వస్తున్నారన్న సమాచారం ముందుగా తెలిసి వ్యాపారులు పాత రాళ్లను దాచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎంతమంది చిరు, బడా వ్యాపారుల వద్ద ముద్రలు వేసిన ఎలక్ట్రానిక్‌ కాటాలు, ఇనుప తక్కెడలు, తూకాలు చేసే రాళ్లు ఉన్నాయనే లెక్కలు అధికారుల వద్ద లేకపోవడం కొసమెరుపు.

స్టాంపులు వేసిన రాళ్లు అంతంతమాత్రం

చాలా దుకాణాల్లో ముఖ్యంగా కూరగాయల మార్కెట్‌ విక్రయదారుల్లో ఎక్కువ మంది వద్ద స్టాంపులు వేసిన తూకం రాళ్లు కనిపించవు. ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ అనేక మంది వ్యాపారులు ఇంకా పాతతరపు త్రాసులనే వాడుతున్నారు. తూకం రాళ్లలో ఏ1 రకం (సరైన రాళ్లు), ఏ2 రకం (నాశిరకం రాళ్లు) ఉంటున్నాయి. వ్యాపారులు తూకం వేసేటపుడు ప్రశ్నించేవారు ఉన్నపుడు ఏ1–రకం రాళ్లు, మిగిలిన సమయాల్లో ఏ2–రకం రాళ్లు వినియోగిస్తున్నారు.

● అనకాపల్లి మార్కెట్‌వీధిలో ఒక కిలో కూరగాయలు కొని తూకం వేస్తే 150 గ్రాములు తేడా వచ్చింది. ఎందువల్ల తేడా వచ్చిందని అడిగితే.. కాటాను సరిచేశారు. ఇప్పుడు సరిగ్గా వచ్చింది.

● మెయిన్‌రోడ్డులో పండ్ల వ్యాపారి వద్దకు వెళ్లి ఒక కేజీ సపోట పండ్లు తీసుకుని తూకం వేస్తే 70 గ్రాములు తక్కువ చూపిస్తోంది. తక్కువగా వచ్చిందేమని అడిగితే మరో సపోటా వేశారు. ఇప్పుడు సరిపోయింది.

● నెహ్రూచౌక్‌, అండర్‌ రైల్వే బ్రిడ్జి వద్ద గల విజయరామరాజు పేటలో ఓ మాంసం దుకాణానికి వెళ్లి కిలో చికెన్‌ తీసుకొని తూస్తే 100 గ్రాములు తక్కువ వచ్చింది. దీంతో దుకాణదారును ‘సాక్షి’ నిలదీయగా అప్పుడప్పుడు పొరపాటున చిన్న తేడా వస్తుందని చెప్పాడు.

● గవరపాలెంలో గల గాంధీమార్కెట్‌లో రోడ్డు కూడలి వద్ద ఉన్న ఒక కూరగాయల దుకాణం నుంచి కేజీ బెండకాయలు తూకం తూస్తే 50 గ్రాములు తక్కువగా చూపించింది.

● పలు దుకాణాల్లో బియ్యం బస్తా 26 కిలోలకు ధర చెల్లిస్తుండగా.. తూకం వేస్తే 25.5 కిలోలు మాత్రమే ఉంటోంది. దీనిపై బియ్యం వ్యాపారులను నిలదీస్తే బుకాయిస్తున్నారు.

● మెయిన్‌రోడ్డును అనుకుని ఉన్న బియ్యం షాపుల్లో బస్తాకు 25 కేజీల చొప్పున ప్యాక్‌ చేసి విక్రయిస్తున్నారు. ఇందులో 200 నుంచి 300 గ్రాములు తక్కువగా ఉంది. వ్యాపారులను అడిగితే తమకు మిల్లర్లు, హోల్‌సేల్‌ షాపుల నుంచి వస్తాయని చెబుతున్నారు. ఈ ప్యాకింగ్‌లు తామేమీ చేయమని, హోల్‌సేల్‌ షాపుల నుంచి కొనుగోలు చేస్తామని చెప్పారు.

సాక్షి, అనకాపల్లి/సాక్షి నెట్‌వర్క్‌:

శుక్రవారం ఉదయం 10 గంటలు.. సాక్షి విలేకరుల బృందం అనకాపల్లి మార్కెట్‌లో ఫీల్డ్‌ విజిట్‌ ప్రారంభించింది. వివిధ రకాలైన 95 దుకాణాలకు వెళ్లింది. ఇందులో 15 షాపుల వారు తూకం పరిశీలించేందుకు సహకరించలేదు. మిగతా 80 దుకాణాల్లో తూకం ఎలా ఉందో పరిశీలించగా 50 చోట్ల బాగానే ఉంది. 30 షాపుల్లో తేడాలు కనిపించాయి. 10 చోట్ల 30 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు తూకం తేడా ఉంది. 20 దుకాణాల్లో ఏకంగా 100 నుంచి 150 గ్రాముల వరకు వినియోగదారులు నష్టపోయేలా కాటాలు ఉన్నాయి. మార్కెట్‌లోని పెద్ద వ్యాపారస్తులు మాత్రమే ఎలక్ట్రానిక్‌ కాటాలను వాడుతున్నారు. సాధారణంగా ఇవి కచ్చితంగా ఉంటాయని అందరి నమ్మకం. కానీ ఆధునిక సాంకేతికతతో ఈ వేయింగ్‌ మిషన్లతోనూ మాయ చేయవచ్చని సాక్షి పరిశీలనలో తేలింది. తూనికలు, కొలతల శాఖ అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేసి సరిపెడుతున్నట్టు శుక్రవారం నాటి విజిట్‌లో అర్థమైంది.

మాయాబజార్‌ 1
1/5

మాయాబజార్‌

మాయాబజార్‌ 2
2/5

మాయాబజార్‌

మాయాబజార్‌ 3
3/5

మాయాబజార్‌

మాయాబజార్‌ 4
4/5

మాయాబజార్‌

మాయాబజార్‌ 5
5/5

మాయాబజార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement