
అనకాపల్లి ఆవఖండంలో దెబ్బతిన్న టమాటా పంటను పరిశీలిస్తున్న ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులు
● జిల్లాలో 944 ఎకరాల్లో పంట నష్టపోయినట్టు ప్రాథమిక సమాచారం ● నేటితో వివరాల సేకరణ పూర్తి
తుమ్మపాల: ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంటలు ధ్వంసమై పలుచోట్ల రైతులు నష్టపోయారు. టమాటా, కూరగాయల పంటలు అధికంగా దెబ్బతిన్నాయి. పలు ఉద్యాన పంటలతోపాటు, మొక్కజొన్న, నువ్వుల సాగుపై ఎక్కువ ప్రభావం పడింది. రైతులకు కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టి చకచకా వివరాలు సేకరిస్తోంది. వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు రెవెన్యూ శాఖ వారితో కలిసి గ్రామాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేస్తున్నారు. గురువారంతో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. సేకరించిన పంట నష్టం వివరాలను ఏప్రిల్ 1 నుంచి 3వ తేదీ వరకు గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తుది జాబితాను కలెక్టర్‌కు నివేదిస్తారు.
పంటనష్టం 33 శాతం దాటితేనే..
జిల్లాలో వివిధ పంటలకు సంబంధించి 902 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అయితే ఈ సంఖ్య క్షేత్రస్ధాయి పరిశీలనలో 944 ఎకరాలకు పెరిగింది. రైతు పండించే పంటలో 33 శాతం గానీ, అంత కన్నా ఎక్కువ గానీ నష్టం జరిగితే మాత్రమే వివరాలు నమోదు చేస్తున్నారు. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు తీసుకుంటున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం మాడుగుల, మాకవరపాలెం, మునగపాక, అనకాపల్లి మండలాల్లో 386 ఎకరాలు, రోలుగుంట, అనకాపల్లి, మునగపాక, యలమంచిలి, అచ్యుతాపురం, దేవరాపల్లి మండలాల్లో 558 ఎకరాలు దెబ్బతిన్నాయి.
జాగ్రత్తలు తీసుకోవాలి
నువ్వులు, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలు ప్రధానంగా దెబ్బతిన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి బి.మోహనరావు చెప్పారు. పంటపొలాల్లో నిల్వ ఉన్న నీటిని బయటకు పంపించి కాయ పక్వదశలో ఉన్న పంటలకు 19.19.19 పదార్ధాన్ని 5 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని పేర్కొన్నారు. మొక్కలకు యూరియా కూడా వేయాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నష్టపరిహారం వివరాలు నమోదు చేస్తున్నామని, గురువారంతో పంట నష్టం వివరాల సేకరణ పూర్తవుతుందని ఉద్యానశాఖ జిల్లా అధికారి ప్రభాకరరావు తెలిపారు. రైతులు తమ గ్రామాల్లో ఉద్యాన, వ్యవసాయ సిబ్బందిని కలిసి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.