
విద్యార్థికి బంగారు పతకం, డిగ్రీ ప్రదానం చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు
● కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు ● ఘనంగా ఐఐఎం 7వ స్నాతకోత్సవం ● విద్యార్థులకు బంగారు పతకాలు, డిగ్రీల ప్రదానం
ఏయూక్యాంపస్: అత్యంత సుందర నగరాల్లో ఒకటిగా విశాఖ నిలుస్తుందని కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు అన్నారు. ఇటువంటి నగరంలో ఉండి పనిచేసే అద్భుత అవకాశం తనకు రాలేదని చెప్పారు. బీచ్‌రోడ్డులోని నోవాటెల్‌లో బుధవారం ఐఐఎం విశాఖపట్నం 7వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. విశాఖ లాంటి బ్యూటిఫుల్ సిటీలో ఉన్న ఐఐఎంలో చదువుకోవడం మీ అందరికీ లభించిన మంచి అవకాశమన్నారు. తనకు ఐఐఎంలో చదువుకునే అవకాశం రాలేదని, అతిథిగా మాత్రమే వెళ్లగలిగానని గుర్తుచేసుకున్నారు. ఇక్కడ గోల్డ్ మెడల్స్ సాధించిన ప్రతి విద్యార్థికి కేవలం పూతపూసినవి ఇవ్వలేదని, స్వచ్ఛమైన మేలిమి బంగారంతో తయారు చేసి అందించారని పేర్కొన్నారు. భవిష్యత్తులో విద్యార్థులంతా మేలిమి బంగారం మెరిసినట్లు.. ఎంచుకున్న రంగంలో అద్వితీయ ప్రగతి, పరిణితి సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు బంగారు పతకాలు, డిగ్రీలను సురేష్ ప్రభు ప్రదానం చేశారు. 2020–2022 బ్యాచ్‌కు చెందిన మొత్తం 239 మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలు పొందారు.
గోల్డ్ మెడల్ విజేతలు వీరే..
పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం(పీజీపీ) విభాగంలో ఆయాన్ వర్మ, ప్రాప్తి ఆలోక్.. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం ఫర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్రొఫెషనల్స్(పీజీపీఎక్స్) విభాగంలో కునాల్ రంజన్, తన్మయ గుప్త.. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం డిజిటల్ గవర్నెన్స్ అండ్ మేనేజ్‌మెంట్(పీజీపీడీజీఎం) విభాగంలో మిన్హాజ్ అహ్మద్, ఆశిం చాబ్లాలు బంగారు పతకాలను సాధించారు. వీరిలో ఆయాన్‌వర్మ, ప్రాప్తి ఆలోక్‌లు రెండేసి గోల్డ్ మెడల్స్ పొందారు.

స్నాతకోత్సవానికి హాజరైన విద్యార్థులు

తల్లిదండ్రులతో ఆనందం పంచుకుంటున్న గోల్డ్ మెడల్ విజేత