
కశింకోట: గంజాయి కేసుతో సంబంధం ఉన్న వారిలో మరో ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు సీఐ రవికుమార్, ఎస్‌ఐ ఎ.ఆదినారాయణరెడ్డి మంగళవారం రాత్రి తెలిపారు. గత ఆదివారం రాత్రి అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ నుంచి అనకాపల్లి వైపు లారీలో బియ్యం బస్తాల మాటున తరలిస్తున్న 890 కిలోల గంజాయి బస్తాలను కశింకోట పోలీసులు పట్టుకుని డ్రైవర్ హరదేవ్ సింగ్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పరారైన అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం లచ్చలపుట్టు గ్రామానికి చెందిన కొంతా సుధాకర్ ఎలియాస్ సుధీర్(25), జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పాలం జిల్లా విష్ణుపుర్ గ్రామానికి చెందిన బబ్లూ కుమార్ యాదవ్(27), ముంచంగిపుట్టు మండలం గంతుర్‌మండ గ్రామానికి చెందిన వంతల భగవాన్(29)లను అనకాపల్లి బస్సు స్టేషన్‌లో అరెస్టు చేసినట్టు తెలిపారు. వీరిలో సుధాకర్ గంజాయి రవాణా వాహనాలకు పైలట్‌గా వ్యవహరిస్తున్నాడన్నారు. ఈ కేసులో గంజాయి కొనుగోలు చేసిన జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ధర్మేంద్ర గుప్తా, చందన గుప్తా, పాడేరుకు చెందిన కిల్లో వాసుదేవ్‌లకు గంజాయి రవాణాలో సహకరించాడన్నారు. వంతల భగవాన్ మాచ్‌ఖండ్ పోలీసు స్టేషన్‌లో గంజాయి కేసులో అరెస్టు అయి మూడేళ్లపాటు కోరాపుట్ జైలులో ఉండి 2022 నవంబర్‌లో కండిషనల్ బెయిల్‌పై విడుదల అయ్యాడన్నారు. మరలా వీరితో చేతులు కలిపి గంజాయి రవాణాకు సహకరించాడన్నారు.
ధర్మేంద్ర గుప్తా వద్ద కారు డ్రైవర్‌గా బబ్లూ కుమార్ యాదవ్ పని చేస్తూ గంజాయి రవాణాలో భాగస్వామిగా నిలిచాడన్నారు. దీంతో వీరిని అరెస్టు చేశామన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ధర్మేంద్ర గుప్తా, కిల్లో వాసుదేవ్, చందన గుప్తాలతోపాటు మరికొంత మంది పరారీలో ఉన్నారన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.


నిందితులు కొంతా సుధాకర్, వంతల భగవాన్, బబ్లూకుమార్ యాదవ్