మృతదేహానికీ వివక్షేనా? | - | Sakshi
Sakshi News home page

మృతదేహానికీ వివక్షేనా?

May 9 2026 8:08 AM | Updated on May 9 2026 8:08 AM

కేజీహెచ్‌లో మృగ్యమైన మానవత్వం

చనిపోయిన ఎంపీటీసీ పార్థివదేహం తరలింపునకు ఇవ్వని మహప్రస్థాన వాహనం

గిరిజనులను పట్టించుకోని

కేజీహెచ్‌ వైద్యులు

జెడ్పీ చైర్‌పర్సన్‌ జోక్యంతో

వాహనం ఏర్పాటు

మహారాణిపేట/కొయ్యూరు : ‘పేదవాడికి ప్రాణం ఉన్నప్పుడు వైద్యం దొరకదు.. ప్రాణం పోయాక గౌరవం దక్కదు’. ఉత్తరాంధ్రకు తలమానికం అని చెప్పుకునే కేజీహెచ్‌లో గిరిజనుల పట్ల అమానుషత్వం మరోసారి బట్టబయలైంది. ఒక ఎంపీటీసీ హోదాలో ఉన్న గిరిజన నాయకుడి మృతదేహాన్ని తరలించడానికి ‘మహాప్రస్థానం’ వాహనాన్ని నిరాకరించి, వ్యవస్థ ఎంతటి మొద్దునిద్రలో ఉందో చాటిచెప్పారు. ప్రజాప్రతినిధులు రోడ్డెక్కితే తప్ప కదలని ఈ మొండి యంత్రాంగంపై ఇప్పుడు సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఆఖరి ప్రయాణానికి అడ్డంకులు

గూడెంకొత్తవీధి మండలం దామణాపల్లి ఎంపీటీసీ కొర్ర బీమరాజు (45) అనారోగ్యంతో పోరాడుతూ శుక్రవారం ఉదయం కేజీహెచ్‌లో తుదిశ్వాస విడిచారు. కొండ కోనల నుంచి మెరుగైన వైద్యం అందుతుందని ఆశతో వచ్చిన ఆ కుటుంబానికి, మరణం తర్వాత కోలుకోలేని చేదు అనుభవం ఎదురైంది. కనీసం మృతదేహాన్ని తరలించడానికి ‘మహాప్రస్థానం’ వాహనాన్ని గానీ, అంబులెన్స్‌ను గానీ కేటాయించమని వేడుకున్నా.. ఆసుపత్రి అధికారులు కనికరించలేదు.

దిక్కుతోచని స్థితిలో అమాయక గిరిజనులు

‘వాహనాలు అందుబాటులో లేవు’ అంటూ సిబ్బంది చెప్పిన మాటలు బాధితుల గుండెల్లో బాణంలా గుచ్చుకున్నాయి. ఆసుపత్రిలోని ఎస్టీ సెల్‌కు సమాచారం అందించినా, అక్కడ కూడా స్పందన కరువైంది. తమ వారిని కోల్పోయిన బాధ ఒకవైపు, పార్థివ దేహాన్ని ఇంటికి ఎలా తీసుకెళ్లాలో తెలియని అయోమయం మరోవైపు.. ఆ గిరిజనుల వేదన వర్ణనాతీతం. వ్యవస్థల మధ్య సామాన్యుడు, ముఖ్యంగా గిరిజనుడు ఎంతటి అగౌరవానికి గురవుతున్నాడో ఈ దృశ్యాలు కళ్లకు కట్టాయి.

నేతల జోక్యంతో కదిలిన యంత్రాంగం

ఈ విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చైర్‌పర్సన్‌, నేరుగా సూపరింటెండెంట్‌తో మాట్లాడారు. ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగడంతో నిమిషాల వ్యవధిలోనే ‘లేవన్న’ వాహనాలు ప్రత్యక్షమయ్యాయి.

మారని వైఖరి..

ఒక ఎంపీటీసీ హోదాలో ఉన్న వ్యక్తికే ఇన్ని ఇబ్బందులు ఎదురైతే, ఇక సామాన్య గిరిజనుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉదయిస్తోంది. గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే రోగుల పట్ల కేజీహెచ్‌ సిబ్బంది వైఖరి మారాలని, మరణంలోనైనా వారికి గౌరవం దక్కాలని స్థానికులు కోరుతున్నారు. చివరికి సుభద్ర, భాగ్యలక్ష్మి బాధితులను పరామర్శించి, వాహనం ఏర్పాటు చేసి పంపించడంతో ఆ విషాద ప్రయాణం ముందుకు సాగింది.

Advertisement
 
Advertisement
Advertisement