తాగునీటి సమస్య పరిష్కరించడంలో విఫలం | - | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్య పరిష్కరించడంలో విఫలం

May 9 2026 8:08 AM | Updated on May 9 2026 8:08 AM

వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు సూర్యనారాయణ విమర్శ

పాడేరు రూరల్‌: గ్రామాల్లో తాగునీటి ఎద్దడిని నివారించడంలో సంబంధిత అధికారులు, పాలకులు పూర్తిగా విఫలమయ్యారని వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్‌ పాడేరు నియోజకవర్గ అధ్యక్షుడు సూర్యనారాయణ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాడేరు నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండ తీవ్రత పెరగడంతో గ్రామాల్లోని రక్షిత తాగునీటి పథకాలు, బోర్లు, బావులు మరియు ఊటగెడ్డలు అడుగంటిపోయాయని, దీనివల్ల ప్రజలకు గుక్కెడు నీరు దొరకని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో గిరిజన గ్రామాల్లో చేపట్టిన జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయని, అధికారుల పర్యవేక్షణ లోపంతో తాగునీటి పథకాలు నిరుపయోగంగా మారాయని ధ్వజమెత్తారు. నీటి కోసం మహిళలు మైళ్ల దూరం నడవాల్సి వస్తోందని పేర్కొన్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి గ్రామాల్లో తాగునీటి కష్టాలు తీర్చడానికి ప్రత్యేక దృష్టి సారించాలని, లేనిపక్షంలో మహిళలతో కలిసి సంబంధిత కార్యాలయాల వద్ద భారీ ఆందోళనలు చేపడతామని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement