పాడేరు: జిల్లాలో ఈనెల 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్షా నిర్వహించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని జేసీ సూచించారు. అన్ని వసతులు ఉన్న కేంద్రాలనే ఎంపిక చేయాలని ఆదేశించారు. పరీక్షలు పారదర్శకంగా జరిగేలా అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. జిల్లాలోని తొమ్మిది పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని జేసీ వెల్లడించారు. ప్రథమ సంవత్సరం జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 1,051 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం జనరల్, ఒకేషనల్ కలిపి 492 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 139 మంది ఇన్విజిలేటర్లను, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు జేసీ తెలిపారు. విద్యార్థులంతా పరీక్ష ప్రారంభ సమయానికి ముందుగానే తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆర్‌ఐవో భీమశంకర్, పలు కళాశాలల అధికారులు పాల్గొన్నారు.
జేసీ తిరుమణి శ్రీపూజ ఆదేశం


