‘మీకోసం’ వినతులు గడువులోగా పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

‘మీకోసం’ వినతులు గడువులోగా పరిష్కారం

May 9 2026 7:32 AM | Updated on May 9 2026 7:32 AM

జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ

పాడేరు: జిల్లా కేంద్రంలో ప్రతి శుక్రవారం నిర్వహించే మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. కార్యక్రమం పూర్తయ్యే వరకు అధికారులు సమగ్ర సమాచారంతో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో జేసీ శ్రీపూజతో పాటు ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఇంచార్జ్‌ డీఆర్వో లోకేశ్వరరావు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి 24 వినతులు, రెవెన్యూ క్లినిక్‌లో 9 వినతులను అధికారులు స్వీకరించారు.అర్జీదారుల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో వారికి స్పష్టంగా వివరించాలని జేసీ అధికారులను ఆదేశించారు.జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో నిర్వహించే పిజిఆర్‌ఎస్‌కు హాజరుకాకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఫిర్యాదుదారులతో అధికారులు మర్యాదగా మెలగాలని, ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే అందుకు గల సాంకేతిక లేదా ఇతర కారణాలను వారికి అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి కృష్ణారావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమళ, హౌసింగ్‌ పీడీ బాబు, జిల్లా వ్యవసాయాధికారి నందు, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి కొంటా వెంకటరావు, జిల్లా ఖజానా అధికారి ప్రసాద్‌ బాబు, ఎల్‌డీఎం మాతునాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement