ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్
కప్పస్తంభానికి మొక్కుకుంటున్న కాసర్ల శ్యామ్
సింహాచలం : సింహాచలం పుణ్యక్షేత్రం, గిరిప్రదక్షిణ ఉత్సవ విశిష్టతను చాటిచెప్పేలా త్వరలోనే ఒక అద్భుతమైన పాటను రాస్తానని ప్రముఖ సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత కాసర్ల శ్యామ్ తెలిపారు. శుక్రవారం ఆయన సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలోని మహిమాన్విత కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న ఆయనకు, అంతరాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ ‘బలగం’ సినిమాలోని ‘ఊరూ పల్లెటూరు దీనితీరే అమ్మ తీరు’ పాటకు జాతీయ అవార్డు రావడం ఆ స్వామివారి అనుగ్రహంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు ఆయనకు క్షేత్ర మహత్యాన్ని వివరించి, స్వామివారి వైభవంపై పాటలు రాయాలని కోరగా.. తప్పకుండా గిరిప్రదక్షిణ ఉత్సవంపై పాట రాస్తానని శ్యామ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం పీఆర్వో అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.


