జిప్సం లారీలు అడ్డగింత | - | Sakshi
Sakshi News home page

జిప్సం లారీలు అడ్డగింత

May 9 2026 7:32 AM | Updated on May 9 2026 7:32 AM

మాకవరపాలెం : ప్రమాదాలకు కారణమవుతున్న జిప్సం లారీలను మండలంలోని భీమబోయినపాలెం గ్రామస్తులు అడ్డుకున్నారు. విశాఖ కోరమండల్‌ నుంచి గత నెల రోజులుగా తాళ్లపాలెం, మాకవరపాలెం, నర్సీపట్నం మీదుగా భారీలోడుతో జిప్సం లారీలు రావాణా అవుతున్నాయి. రాజమండ్రి వెళ్లే ఈ లారీలు టోల్‌ చార్జీలు చెల్లించకుండా ఉండేందుకు ఇటుగా వెళుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ లారీల నుంచి జిప్సం పౌడర్‌ రోడ్డుపై జల్లుకుంటూ లారీలు వెళుతున్నాయి. దీంతో వెనుక వచ్చే ద్విచక్రవాహనదారుల కళ్లలో ఈ పౌడర్‌ పడి ఇబ్బందులు పడుతున్నారు. కళ్లలో పడిన వెంటనే మంట వస్తుందని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. ఈ జిప్సం కారణంగా భీమబోయినపాలెం గ్రామానికి చెందిన పప్పల అశోక్‌కుమార్‌ ద్విచక్ర వాహనంపై వెళుతూ తీవ్రంగా గాయపడినట్టు గ్రామస్తులు తెలిపారు. నిత్యం ఎవరో ఒకరు ఈ కారణంగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం తాజామాజీ సర్పంచ్‌ రుత్తల కిశోర్‌ ఆధ్వర్యంలో గ్రామస్తులు రెండు లారీలను అడ్డుకున్నారు. అనంతరం వాటిని పోలీసులకు అప్పగించారు. అధికారులు స్పందించి ఈ మార్గం గుండా ఈ లారీలు తిరగకుండా చర్యలు తీసుకోవాలని ద్విచక్ర వాహనదారులు, స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement