రోలుగుంట : మండలంలోని అర్ల గిరిజన పంచాయతీ కొండ శిఖరాగ్రాన ఉన్న నీలిబంద గ్రామంలో పలువురు జ్వరాలతో మంచాన పడ్డారు. జ్వరంతో సకాలంలో చికిత్స పొందని పరిస్థితిలో ఇదే గ్రామానికి చెందిన డిప్పల సురేష్(2) ఇంటి వద్దే శుక్రవారం మృతి చెందినట్టు పీవీటీజీ సంఘ నాయకుడు గెమ్మిల వాసు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాలివి. జి.మాడుగుల మండలం నుంచి నీలిబంద గ్రామానికి వలస వచ్చిన గిరిజనులు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. జ్వరాల బారిన పడిన వారిలో డిప్పల సూరిబాబు (3), గెమ్మిల నవీన్(2), వంతల అఖిల్ (2), డిప్పల రమేస్(8), కొర్ర ప్రవీణ్(2), కొర్ర రుక్తి(5) ఉన్నారు. ఈ గ్రామం నుంచి మండలంలోని బుచ్చింపేట పీహెచ్‌సీకి వైద్యానికి రావాలంటే కొండ శిఖరాగ్రం నుంచి మేలైన రవాణా మార్గం, వాహనాలు రాకపోకలు లేని పరిస్థితిలో 13 కిలోమీటర్లు నడచుకుని డోలిమోతతో రావాలి. ఈ గ్రామానికి ఆశా కార్యకర్త కానీ, ఏఎన్‌ఎం కాని లేరు. ఎవరు అనారోగ్యం బారిన పడినా బుచ్చింపేట పీహెచ్‌సీకి 13 కిలోమీటర్ల దూరం నడిచి రావాల్సిందే. ఈ సమస్యలపై జిల్లా కలెక్టర్ స్పందించి, తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించి, రవాణా సదుపాయాలు మెరుగుపరచాలని, ఏఎన్‌ఎంని నియమించాలని కోరారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి జ్వరపీడితులకు తక్షణ వైద్యం అందించాలని ఆయన డిమాండు చేశారు.


