అల్లూరి ఆశయ సాధనకు కృషి | - | Sakshi
Sakshi News home page

అల్లూరి ఆశయ సాధనకు కృషి

May 8 2026 11:02 AM | Updated on May 8 2026 11:02 AM

● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ● మన్యం వీరుడికి ఘన నివాళి

సాక్షి,పాడేరు: దేశ స్వాతంత్య్రం,గిరిజనుల హక్కుల కోసం బ్రిటీషు సామ్రాజ్యంతో పోరాడి, చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం చారిత్రాత్మకమని జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ అన్నారు. కలెక్టరేట్‌లో ఆయన వర్థంతిని గురువారం నిర్వహించారు. దీనిలో భాగంగా అల్లూరి చిత్రపటంతో పాటు విగ్రహానికి జేసీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అల్లూరి పోరాటం, ధైర్యసాహసాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు.అల్లూరి ఆశయాలకు అనుగుణంగానే ప్రతి ఒక్కరు దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలన్నారు. గిరిజన యువత బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు, ఎస్‌డీసీ నీలకంఠరావు, సీఐ దీనబంధు, కలెక్టరేట్‌ ఏవో ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

చింతపల్లి: మన్యంలో అల్లూరి సీతారామరాజు చేపట్టిన ఉద్యమ స్ఫూర్తితో అభివృద్ధి ఫలాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద నిర్వహించిన అల్లూరి వర్ధంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అతి చిన్న వయసులోనే బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించి, మన్యంలో స్వాతంత్య్ర కాంక్షను నింపిన మహనీయుడు అల్లూరి అని ఎమ్మెల్యే కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ఏజెన్సీ ప్రాంతంలోని సమస్యల పరిష్కారానికి రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య పడాల్‌, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తడబారికి సురేష్‌ కుమార్‌, పంచాయతీరాజ్‌ విభాగం కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్‌, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి బూసరి కృష్ణారావు, గూడెంకొత్తవీధి మండల పార్టీ అధ్యక్షులు కంకిపాటి గిరిప్రసాద్‌ పాల్గొన్నారు. అలాగే చింతపల్లి మాజీ మండల పార్టీ అధ్యక్షులు మోరి రవి, కో–ఆప్షన్‌ సభ్యుడు నాజర్‌ వల్లి, పార్టీ జిల్లా కోశాధికారి కుందేరి రామకృష్ణ, పీసా కమిటీ కార్యదర్శి గబులంగి నాగేశ్వరరావు, నాయకులు కరీం, చంటిబాబు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఆయన పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం :

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ మాధవ్‌

కొయ్యూరు: అల్లూరి పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శంగా నిలవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ మాధవ్‌ పిలుపునిచ్చారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి పురస్కరించుకుని గురువారం ఆయన మంప, రాజేంద్రపాలెంలోని అల్లూరి స్మారక మందిరాలను సందర్శించి, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజేంద్రపాలెం పార్కులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం గొప్ప విషయమని కొనియాడారు. రాజేంద్రపాలెం, మంప అల్లూరి స్మారక పార్కుల అభివృద్ధికి రూ. 2 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ను కూడా నిధులు కేటాయించాలని కోరగా, ఆయన తన కోటా నుంచి నిధులు ఇచ్చేందుకు అంగీకరించారని చెప్పారు. గతంలో రాజ్యసభ సభ్యులు సురేష్‌ ప్రభు ఇచ్చిన రూ. 50 లక్షలతో ఈ పార్కులను అభివృద్ధి చేశామని, ఆ తర్వాత మాజీ ఎంపీ కొత్తపల్లి గీత కూడా రూ. 10 లక్షలు కేటాయించారని గుర్తుచేశారు. అల్లూరి పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ పార్టీ మండల అధ్యక్షులు సంపరి శివకుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు ఎం. శాంతకుమారి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌ కుమార్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నరేంద్ర, స్వప్న కుమారి, గాదే శ్రీనివాసరావు, పాడేరు ఏఎంసీ చైర్మన్‌ మంగతల్లి, బీజేపీ విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు పరశురామరాజు, పరమేశ్వరరావు, ట్రైకార్‌ డైరెక్టర్‌ కృష్ణారావు, పాంగి రాజారావు, కురుసా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

పాడేరు రూరల్‌: ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గురువారం పాడేరులో అల్లూరి వర్థంతి నిర్వహించారు. ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి. అప్పలనర్స, పలు ప్రజా సంఘాల నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంతరించిపోతున్న ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో పాటు ఆదివాసీల భూములు, వన్యప్రాణులు, సహజ వనరులు, కార్పొరేట్‌ శక్తులకు నిలుదోపీడీకి గురికాకుండా కాపాడుకునేందుకు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు.గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్‌, అధ్యక్షుడు ధర్మన్నపడాల్‌, జిల్లా ఉపాధ్యక్షుడు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

డుంబ్రిగుడ: స్థానిక యూనియన్‌ బ్యాంక్‌ ఆవరణలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద అల్లూరి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఆయన వర్థంతి నిర్వహించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువజన సేవా సంఘం అధ్యక్ష, కార్యదర్శి కమ్మిడి, సూర్యప్రకాశ్‌, నవసూర్య, వైఎస్సార్‌సీపీ మండల కార్యదర్శి మఠం శంకర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement