● దిగుబడి పెరిగినా అందని గిట్టుబాటు ధర
● రూ.22 నుంచి రూ.16కు పడిపోయిన ధర
● తేమ సాకుతో వ్యాపారుల కొర్రీలు
● ఆందోళనలో రైతాంగం
కొయ్యూరు: ఏ వస్తువుకై నా ఉత్పత్తి విపరీతంగా పెరిగి, డిమాండ్ తగ్గితే ఆ వస్తువు ధర పడిపోవడం సహజం. ప్రస్తుతం మొక్కజొన్న సాగు చేస్తున్న రైతుల పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. కిందటి ఏడాది ధరలు ఆశాజనకంగా ఉండటంతో లాభాలు వస్తాయన్న ఆశతో ఈ ఏడాది రైతులు భారీ విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేశారు. అయితే, ఉత్పత్తి విపరీతంగా పెరగడంతో మార్కెట్‌లో ఒక్కసారిగా డిమాండ్ పడిపోయింది. ఫలితంగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ధరల తగ్గుదల.. వ్యాపారుల కొర్రీలు..
గత ఏడాది కిలో మొక్కజొన్నను రూ. 22 కు కొనుగోలు చేసిన వ్యాపారులు, ప్రస్తుతం రూ. 16 కంటే ఎక్కువ ఇవ్వలేమని తెగేసి చెబుతున్నారు. దీనికి తోడు తేమ శాతం పేరుతో వ్యాపారులు పెడుతున్న నిబంధనలు రైతులకు శాపంగా మారాయి. పొత్తులను వారం రోజుల పాటు, గింజలను మరో వారం పాటు ఎండబెట్టాలని వ్యాపారులు కోరుతున్నారు. గతంలో ఆరకముందే కొనుగోలు చేసిన వ్యాపారులు, ఇప్పుడు పూర్తిగా ఆరితే తప్ప కొనబోమని చెబుతున్నారు. గింజలు ఎంత ఎక్కువగా ఆరితే, అంతగా బరువు తగ్గిపోయి మరింత నష్టం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెట్టుబడి భారం.. దొరకని కూలీలు
మొక్కజొన్న సాగులో ఎకరాకు సుమారు 3 టన్నుల దిగుబడి వస్తుంది. అయితే, ఎకరాకు పెట్టుబడి ఖర్చు రూ. 40 వేలు దాటిపోతోంది. గత ఏడాది ధర (రూ.22) లభిస్తేనే రైతులకు కనీస లాభాలు వచ్చేవి. ప్రస్తుత ధరతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. దీనికి తోడు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు జరుగుతుండటంతో, కూలి డబ్బులు ఇస్తామన్నా మొక్కజొన్న కోతలకు కూలీలు దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. కోళ్లు, చేపల దాణాకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని ఆశపడి సాగు చేసిన తమకు, ఇప్పుడు వ్యాపారులు ముఖం చాటేయడం లేదా ధర తగ్గించడం కోలుకోలేని దెబ్బని మన్యపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొక్కజొన్న రైతు కన్నీరు
పెట్టుబడి కూడా వచ్చేలా లేదు
లాభాలు వస్తాయన్న ఆశతో ఈ ఏడాది మొక్కజొన్న పంట వేశాం. తీరా చూస్తే, వ్యాపారులు ఒక్కసారిగా ధర తగ్గించడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నాం. పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితి నెలకొంది. ఈ నష్టాలను భరించలేక వచ్చే ఏడాది నుంచి ఈ పంట సాగును మానేయాలని నిర్ణయించుకున్నాం. ఒకవైపు ధర లేక ఇబ్బంది పడుతుంటే, మరోవైపు కూలి డబ్బులు ఇస్తామన్నా పనులకు ఎవరూ రాకపోవడంతో సమస్యలు మరింత ఎక్కువయ్యాయి.
– పి.ఏసు, మొక్కజొన్న రైతు, కొయ్యూరు


