ఐటీడీఏ పీవో
ఆదిత్యవర్మ ఆదేశం
పాడేరు: జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆదిత్యవర్మ ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మిస్తున్న మల్టీపర్పస్ సెంటర్లు, జిల్లాలోని ఇతర నిర్మాణ పనుల పురోగతిపై ఆయన సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. జిల్లాలో మంజూరైన 35 మల్టీపర్పస్ సెంటర్లు, 46 హాట్ బజార్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఆశ్రమ పాఠశాలల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, అన్ని పాఠశాలల్లో తరగతి గదులు, మరుగుదొడ్లు, విద్యుదీకరణ, ఇతర మరమ్మతు పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు.కలెక్టరేట్ ఎస్‌సీఏ, ఆర్టికల్ 275, డీఏజేజీ నిధుల కింద చేపట్టిన పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. కన్వర్జెన్సీ పనుల్లో జాప్యం జరగకుండా నిధులను సద్వినియోగం చేసుకుంటూ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. పూర్తయిన వన్ స్టాప్ సెంటర్లలో అంగన్‌వాడీ, వీడీవీకే, మినీ స్కూళ్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని, వచ్చే 15 రోజుల్లో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, టీడబ్ల్యూ డీడీ పరిమళ, ఐటీడీఏ ఏవో హేమలత, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ ప్రతాప్, ఏటీడబ్ల్యూవోలు, ఇంజనీరింగ్, వెలుగు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


