జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ
సాక్షి, పాడేరు: జిల్లాలోని ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ‘జల్ జీవన్ మిషన్’ పనులను వేగవంతం చేసి 2028 నాటికి హర్ ఘర్ జల్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో తాగునీరు, పారిశుధ్య మిషన్ జిల్లా కమిటీ సమావేశాన్ని ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జల్ జీవన్ మిషన్‌లో పెండింగ్‌లో ఉన్న తాగునీటి పథకాల పనులను తక్షణమే పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా అంగన్‌వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి, అక్కడ తాగునీరు మరియు మరుగుదొడ్ల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. తాగునీటి పథకాలకు అవసరమైన విద్యుత్ కనెక్షన్లు, పైపులైన్ల తవ్వకాలకు సంబంధించి రోడ్డు కటింగ్ అనుమతులను విద్యుత్, ఆర్‌అండ్‌బీ శాఖలు వెంటనే మంజూరు చేయాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.అనంతరం, అమరావతిలో సీఎం చంద్రబాబు కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులోని అంశాలపై జేసీ తిరుమణి శ్రీపూజ జిల్లా అధికారులతో సమీక్షించారు. ఆయా శాఖల వారీగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రాధాన్యతలను వివరించారు. ఈ సమావేశంలో పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


