మోదమ్మ ఉత్సవాల్లో ‘కూటమి’ రాజకీయం | - | Sakshi
Sakshi News home page

మోదమ్మ ఉత్సవాల్లో ‘కూటమి’ రాజకీయం

May 8 2026 11:02 AM | Updated on May 8 2026 11:02 AM

● ఉత్సవ సమావేశానికి మొక్కుబడిగా ఆహ్వానం ● ప్రభుత్వం రూ.కోట్లు ఇస్తే.. బలవంతపు వసూళ్లు ఎందుకు? ● ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్‌ మత్స్యరాస విశ్వేశ్వరరాజు ధ్వజం

● ఉత్సవ సమావేశానికి మొక్కుబడిగా ఆహ్వానం ● ప్రభుత్వం రూ.కోట్లు ఇస్తే.. బలవంతపు వసూళ్లు ఎందుకు? ● ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్‌ మత్స్యరాస విశ్వేశ్వరరాజు ధ్వజం

సాక్షి, పాడేరు: స్థానిక ఆరాధ్య దైవం మోదకొండమ్మ తల్లి ఉత్సవాలను కూటమి ప్రభుత్వం రాజకీయమయం చేస్తోందని పాడేరు ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్‌ మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్సవాలకు సంబంధించి కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించనున్న సమావేశానికి రావాలని కోరుతూ అధికారులు పంపిన ఆహ్వాన పత్రాన్ని ఆయన తిరస్కరించారు. గురువారం రాత్రి లోచలిపుట్టు క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన రెవెన్యూ అధికారులకు ఆ పత్రాన్ని తిరిగి ఇచ్చేస్తూ.. ఇటువంటి మొక్కుబడి ఆహ్వానాలు తనకెందుకని, ఈ సమావేశానికి హాజరయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 40 ఏళ్ల మోదకొండమ్మ తల్లి పండగ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం రాజకీయ కోణంలో ఉత్సవ తేదీలను మార్చడం దారుణమన్నారు. ఇది భక్తుల మనోభావాలను కించపరచడమేనని మండిపడ్డారు. మొదట తన అధ్యక్షతన నిర్ణయించిన మేరకు మే 10, 11, 12 తేదీల్లో ఉత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని, ఈ తరుణంలో తేదీలను మార్చడం వెనుక అంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇప్పటికే లైటింగ్‌, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలకు అడ్వా న్స్‌లు చెల్లించామని గుర్తు చేశారు. తాము చెల్లించిన అడ్వాన్సుల మేరకే కలకత్తా లైటింగ్‌ను వినియోగించుకుంటున్న ప్రభుత్వం.. ఎగ్జిబిషన్‌ నిర్వాహకులను మాత్రం పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వడం దారుణమన్నారు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 2 కోట్లు ఇస్తోందని ప్రచారం చేసుకుంటున్న కమిటీ పెద్దలు, మళ్లీ ప్రజల నుంచి బలవంతంగా చందాలు ఎందుకు వసూలు చేస్తున్నారని ఆయన నిలదీశారు. ప్రభుత్వం ఇచ్చే నిధులు ఏమవుతున్నాయని ప్రశ్నించారు. ఉత్సవ తేదీలు మార్చినా, ఈ నెల 12వ తేదీన మోదకొండమ్మ తల్లి పుట్టినరోజు వేడుకను మాత్రం తాము అత్యంత ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement