● డ్రైవింగ్ లైసెన్స్ లేనివారిపై చర్యలు
● ఐదు వాహనాలు స్వాధీనం
కొయ్యూరు: సరైన డ్రైవింగ్ లైసెన్స్‌లు లేకుండా నడుపుతున్న ఐదు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ కిషోర్‌వర్మ తెలిపారు. సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కాకరపాడు జంక్షన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ధ్రువీకరణ పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను, యజమానులు అన్ని రకాల పత్రాలను చూపించిన తర్వాతే అప్పగిస్తామని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. కొన్ని చోట్ల మైనర్లు వాహనాలు నడుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారు కనిపిస్తే వారి తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్లపై పశువులను వదిలే యజమానులపై చర్యలు తీసుకుంటామని, లేనిపక్షంలో ఆ పశువులను గోశాలకు తరలిస్తామని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు స్వీయ నియంత్రణతో డ్రైవింగ్ చేస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చు అని ఎస్‌ఐ కిషోర్‌వర్మ పేర్కొన్నారు.


