గంజాయి జోలికి వెళ్తే జీవితాలు ఛిన్నాభిన్నం | - | Sakshi
Sakshi News home page

గంజాయి జోలికి వెళ్తే జీవితాలు ఛిన్నాభిన్నం

May 8 2026 11:02 AM | Updated on May 8 2026 11:02 AM

ముంచంగిపుట్టు: గంజాయి సాగు, రవాణా వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే జీవితాలు ఛిన్నాభిన్నం అవుతాయని స్థానిక సీఐ ఎస్‌. లక్ష్మణరావు హెచ్చరించారు. సీఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మొదటిసారిగా గురువారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌ రికార్డులను పరిశీలించి, సిబ్బందితో మండలంలోని శాంతిభద్రతల పరిస్థితులపై ఆరా తీశారు. అనంతరం మండలంలోని పనసపుట్టు పంచాయతీ, సంగంవలస గ్రామంలో పర్యటించిన సీఐ, గిరిజనులతో మమేకమయ్యారు. ప్రజలకు భద్రత మరియు చట్టాలపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన సదస్సులో ఆయన కీలక విషయాలను వివరించారు. యువత తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో అక్రమ మార్గాల్లో వెళ్లి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. వాగులు, గెడ్డల వద్ద ప్రమాదాలు జరగకుండా పిల్లలను ఒంటరిగా పంపవద్దని తల్లిదండ్రులను కోరారు. మహిళల రక్షణ చట్టాలు, దొంగతనాల నివారణ, సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. బాల్య వివాహాలను అరికట్టాలని, గ్రామంలోకి వచ్చే కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి, గిరిజన ప్రాంత అభివృద్ధికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ పి. నాని, సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు.

సీఐ లక్ష్మణరావు హెచ్చరిక

Advertisement
 
Advertisement
Advertisement